ఆంధ్రాలో అంతరాష్ట్ర హంతక ముఠా పార్ధిగ్యాంగ్‌:కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు:దేశంలోనే అత్యంత కిరాతకమైన హంతక ముఠా పార్థి గ్యాంగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టిందట...వీళ్లు చేసే నేరాల తీవ్రత నరరూప రాక్షసులు అంటే వీళ్లే అనేట్లుగా ఉంటుందట. అలాంటి భయంకరమైన హంతక ముఠా పార్ధిగ్యాంగ్‌ ప్రస్తుతం చిత్తూరు-తమిళనాడు, చిత్తూరు-నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తుందోని నెల్లూరు జిల్లా పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

ఈ సమాచారం తెలిసిన వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ శుక్రవారం సిబ్బందితో సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్ధిగ్యాంగ్‌ కదలికల విషయంతో అత్యంత అప్రమప్తంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా నేషనల్ హైవే వెంబడి ప్రాంతాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. నిందితులు అత్యంత కిరాతకులు కావడంతో ఎదురైతే దాడులకు తెలగబడే అవకాశం ఉందని, అందువల్ల గస్తీ సిబ్బంది తప్పనిసరిగా గన్స్ వెంటవుంచుకోవాలని, అవసరమైతే కాల్చివేయటానికి ఏమాత్రం వెనుకాడవద్దని ఆదేశాలు జారీ చేశారు.

 ఈ పార్థీ గ్యాంగ్...ఎక్కడిదంటే?

ఈ పార్థీ గ్యాంగ్...ఎక్కడిదంటే?

అత్యంత కిరాతకమైన ఈ పార్థీ గ్యాంగ్ లోని సభ్యులు మధ్యప్రదేశ్‌-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు చెందినవారు. వీళ్లలో అత్యధికులు మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాద్ కు చెందినవారు కాగా మరికొంతమంది మధ్యప్రదేశ్ భోపాల్‌, మల్కాపూర్,నేపాలీనగర్ తదితర ప్రాంతాల వారు కూడా ఉన్నారు. తరతరాలుగా కుటుంబాలతో సహా దొంగతనాలు చేయడంలో ఆరితేరిన ఈ ముఠా దోపిడీల విషయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తుంది. ఉపాధి కోసం తరలివచ్చిన కూలీల్లా కుటుంబాలతో సహా ఇతరరాష్ట్రాలకు తరలివెళ్లి పట్టణ సరిహద్దులు, శివారు ప్రాంతాలు, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిల కింద, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల సమీపంలో తాత్కాలిక గుడారాలు వేసుకుని సంచార జీవులుగా మకాం వేస్తారు.

వృత్తి వేరు...ప్రవృత్తి వేరు

వృత్తి వేరు...ప్రవృత్తి వేరు

ఈ ముఠాలోని మహిళలు పగటి వేళల్లో తాము మకాం వేసిన పరిసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకోవడం, పిన్నీసులు, పూసలు అమ్మడం వంటివి చేస్తూ తమ దోపిడీకి అనువుగా ఉండే ఇంటిని అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి ఇంటిని ఎంచుకోవడం అయ్యాక రాత్రి వేళల్లో ఆ ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతారు. ఆ సమయంలో అత్యంత నేర్పుగా వ్యవహరిస్తూ తమ కదలికలు ఎవరూ గమనించకుండా లక్ష్యం పేర్తిచేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ క్రమంలో ఎవరైనా వీరిని గుర్తిస్తే వారిని అంతమొందించడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలాగే తాము ఎంచుకున్న ఇంట్లో దొంగతనం పూర్తిచేసే క్రమంలో అత్యంత భీభత్సం సృష్టించడమే వీరి దోపిడీ స్టైల్.

ఏం చేస్తారు?...

ఏం చేస్తారు?...

ఏం చేస్తారు?...ఎలా చేస్తారంటే?..తాము టార్గెట్ గా పెట్టుకున్న ఇంట్లోకి ఒక్కసారి ప్రవేశించాక వీరు ఇక నరరూప రాక్షసులుగా మారి విజృంభిస్తారు. ముఠాలోని సభ్యులు ఆడైన, మగైనా సరే ఎదుటివారు చిన్నా, పెద్దా, స్త్రీ, పురుషులనే తేడాలేకుండా అత్యంత క్రూరంగా విచక్షణా రహితంగా రాడ్ లతో తలలు పగలగొట్టడం, కత్తులతో గొంతు కోసేయడం చేసేసి దోపిడీ ప్రక్రియ నిరాటంకంగా పూర్తి చేస్తారు. నేరానికి పాల్పడే సమయంలో వీరికంటబడితే చావుమూడినట్లే అనే పరిస్థితి ఉంటుంది. ఈ పార్ధి గ్యాంగ్‌ ఒకటే గ్యాంగ్ గా ఉండదు. బృందాలుగా విడిపోయి ఏకకాలంలో వేర్వేరు చోట్ల దోపిడీలకు పాల్పడుతుంటారు. ఒక్కో గ్యాంగ్ లో 10 నుంచి 20 మంది సభ్యులు వరకు ఉండొచ్చు. ఈ దోపిడీల్లో పురుషుల కంటే నేర్పుగా దోపిడీకి, క్రూరంగా హత్యలకు పాల్పడే మహిళలు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గతంలో...తెలుగు రాష్ట్రాల్లో ఆనవాళ్లు...

గతంలో...తెలుగు రాష్ట్రాల్లో ఆనవాళ్లు...

ఈ పార్థి గ్యాంగ్‌కు సంబంధించిన పలువురు ముఠా సభ్యులను గతంలో 2014లో వరంగల్, 2015లో విశాఖ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాదు 2015 ఆగష్ట్ నెలలో ఒక పార్థి గ్యాంగ్ ను కంది జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు తరలిస్తున్న క్రమంలో నలుగురు ఈ ముఠా సభ్యులు తప్పించుకు పారిపోయారు.
అంతకుముందు 2005లో ఒక పార్థి గ్యాంగ్ నెల్లూరులో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎంజీ బ్రదర్స్‌ ఇంట్లో దోపిడీకి పాల్పడింది. రెండు రోజులు రెక్కీ నిర్వహించి ఈ చోరీకి ప్లాన్ చేశారని, ఇంటి కుక్కలకు మత్తు బిస్కెట్‌లు వేసి ఆ తరువాత వాచ్‌మన్‌ను హత్య చేసి ఇంట్లో ప్రవేశించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన నెల్లూరులో సంచలనం సృష్టించగా ఆ తరువాత కావలిలో జరిగిన ఇదే తరహాలో నేరాన్ని వీరే చేసినట్లు తెలిసింది.

బి ఎలెర్ట్...పోలీసు వారి హెచ్చరిక

బి ఎలెర్ట్...పోలీసు వారి హెచ్చరిక

ఈ పార్థీ గ్యాంగ్ సంచారం విషయమై నెల్లూరు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ "జిల్లా సరిహద్దుల్లో పార్థీ గ్యాంగ్ సంచరిస్తుందన్న సమాచారం అందింది...ముందస్తు చర్యల్లో భాగంగా సిబ్బందిని అప్రమత్తం చేశాం. జిల్లావ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, కొత్తవారు తారసపడితే వెంటనే డయల్‌ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి"...అని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nellore: The country's most cruel criminal gangster group Partha Gang is currently entered in Nellore District border areas in Andhra Pradesh. The police have been informed to this extent. The district SP warned people to act adamantly.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి