సింహాచలం ఘటన వెనుక - విచారణలో బట్టబయలు..!!
సింహాచలం ఆలయంలో జరిగిన దుర్ఘటన పైన విచారణ పూర్తి అయింది. ఘటన పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ప్రాథమిక విచారణ పూర్తిచేసింది. దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేసిన కమిషన్ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ ఘటన వెనుక కారణాలపైన విస్తు పోయే అంశాలను పొందుపర్చినట్లు సమాచారం.
సింహాచలం ఆలయంలో చందనోత్సవంలో జరిగిన అపశ్రుతిపై రెండో రోజూ త్రిసభ్య కమిటీ విచారణ చేసింది. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో దాదాపు 20 మందిని విచారించింది. పట్టణ, పరి పాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ అధ్యక్షతన కమిషన్ సభ్యులు ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు దేవదాయశాఖ, సింహాచలం దేవస్థానం, పర్యాటకశాఖ అధికారులతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, అగ్ని మాపక, పోలీసులను విచారించారు. ప్రమాదం ఎలా సంభవించింది? అందుకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడి స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. వారి నుంచి పలు దస్త్రాలు తీసుకున్నారు. జిల్లా అధికారుల నుంచి ఆరా తీసారు.

విచారణ సమయంలో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఈఈ రమణ దానికి హాజరుకాకుండా పనుల నిమిత్తం అరకు వెళ్లిపోయారు. ఇది గుర్తించిన అధికారులు ఫోన్‌లో సంప్రదించగా అందుబాటు లోకి రాలేదు. ఆయన తీరును త్రిసభ్య కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఇతర మార్గాల్లో ఈఈ రమణకు సమాచారం చేరవేసి వెంటనే వెనక్కి రప్పించారు. ప్రాథమిక విచారణలో గోడ నిర్మాణం లో లోపాలను గుర్తించిన కమిషన్ సింహాచలం ఆలయం, దేవదాయశాఖ, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్ ఉద్యోగుల మీద గట్టి చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 8 నుంచి 10 మందితో పాటు గుత్తేదారు మీదా చర్యలు ఉండవచ్చని తెలుస్తోంది. మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపి ఘటన జరగడానికి గల కారణాలు, భవిష్యత్ జాగ్రత్తలపై నెల రోజుల్లోగా మొత్తం నివేదిక సమర్పించేందుకు కమిషన్ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications