తెలుగు జాతిని ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారు?
తెలుగు జాతిని ఔట్ సోర్సింగ్ కు ఇచ్చేసినట్లు కనపడుతోందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. మేథోపరమైన చొరవ కోల్పోయి, రాజకీయ ఒరవడిలో కోల్పోయి, జాతికి లేనిపోని అవలక్షణాలు అలవడ్డాయని చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సమతా పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు వి.వి.కృష్ణారావు ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, వర్గాలతో ఆత్మీయ కలయికను ఏర్పాటుచేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నైతిక పునాదులమీద ఏర్పడినది తెలుగుజాతి ఒక్కటేనని, ఇటీవల రాజకీయాల కోసం జాతి భవిష్యత్తును కౌలుకిచ్చే పరిస్థితులు కనపడుతోందనే ఆందోళనను ఏబీ వ్యక్తం చేశారు.

2014లో తెలుగుజాతి విడిపోయి రెండుగా అయినప్పుడు ఏపీకి అంధకారంలో నుంచి అవకాశాలను అందిపుచ్చుకునే గొప్ప అవకాశం వచ్చిందని, రాష్రానికి గొప్ప వరం మానవ వనరులేనన్నారు. ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఎందుకున్నామనేది మేధోవర్గాలు, బుద్ధి జీవులు, చదువుకున్న వాళ్లు ఆలోచించాలి అని వ్యాఖ్యానించారు.
కొత్తగా ఏర్పడిన ఏపీలో విపరీత పరిస్థితులు, కొన్ని ఉన్మాదాలు, ఇబ్బందులు ఉన్నాయని, వీటన్నింటినీ పసి పిల్లలకు వచ్చే జబ్బుల్లాగే చూసి అధిగమించాలేకానీ నిరాశ చెందకూడదని సూచించారు. వీటిని సవరించుకోకపోతే భవిష్యత్తు తరాలు జీవించడమే ప్రశ్నార్థకంగా మారిపోతుందన్నారు.

భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, రాష్ట్రాల హక్కుల కోసం ఎన్టీఆర్, జ్యోతి బసు లాంటి నేతలు పొరాడారన్నారు. కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications