కుంభమేళాకు ఏపీ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ - షెడ్యూల్, ధరలు..!!
మహా కుంభమేళాకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 40 కోట్ల మంది ఈ మహా కుంభ మేళాకు హాజరవుతారని అంచనా. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దాదాపు 13 వేల ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహా కుంభ మేళాకు వెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ మహాకుంభ మేళా ప్రారంభం కానుంది. ఈ సమయంలోనే ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
ఈ నెల 14న ప్రారంభం కానున్న మహా కుంభమేళా 45 రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి 26 ప్రత్యేక రైళ్లను కేటాయించారు. ఏపీ లోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్ నుంచి రైళ్లు బయల్దేరనున్నాయి. మహా కుంభమేళా లో 45 కోట్ల మంది భక్తులు గంగా స్నానం ఆచరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో వారణాసి వెళ్లే భక్తులకు అవకాశం కల్పిస్తూ ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీ ప్రకటించింది.

ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీ లో విశాఖ- గోరఖ్‌పూర్ మధ్య జనవరి 5, 19, ఫిబ్రవరి 16 తేదీల్లో ప్రత్యేక రైలు(08562)ను ఈస్ట్‌కోస్ట్ రైల్వే నడపనుంది. ఆదివారం రాత్రి బయల్దేరి మంగళవారం రాత్రి గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. తిరిగి (08561) జనవరి 8, 22, ఫిబ్రవరి 19 తేదీల్లో బుధవారాల్లో మధ్యాహ్నం బయల్దేరి శుక్రవారం విశాఖపట్నం చేరుకుంటుంది. విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపుర, ఛత్రపూర్, బలుగావ్, ఖుర్దారోడ్డు, భువనేశ్వర్ తదితర స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఇక సికింద్రాబాద్ నుంచి తొలి రోజు ఉదయం 9:25 గంటలకు (దానాపూర్ ఎక్స్‌ప్రెస్) ప్రారంభమవుతుంది.
రెండో రోజు మధ్యాహ్నం 1.30గంటలకు వారణాసి చేరుకుంటారు. అదేరోజు సాయంత్రం గంగ హారతి దర్శించుకున్న అనంతరం రాత్రి భోజనం, బస అక్కడే ఉంటుంది. ప్యాకేజీలో భాగంగా
మూడో రోజు ఉదయం టిఫిన్ తర్వాత వారణాసిలోని ప్రసిద్ధ ఆలయాల (కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్ మందిర్, బిర్లా మందిర్ )ను సందర్శించుకోవచ్చు. ఈ ట్రిప్ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుందని ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఇక, త్రీటైర్ ఏసీలో ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్ రూ.48,730, ట్విన్ షేరింగ్ ప్యాకేజీ రూ.31,610గా నిర్ణయించారు.
ట్రిపుల్ షేరింగ్ రూ.29,390 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు (విత్ బెడ్) రూ.22,890, విత్ అవుట్ బెడ్ రూ.14,650 చెల్లించాలి. స్లీపర్ క్లాస్ సింగిల్ షేరింగ్ రూ.45,700, ట్విన్ షేరింగ్ రూ.28,570, ట్రిపుల్ షేరింగ్ రూ.26,360. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ రూ.19,860, విత్ అవుట్ బెడ్ రూ.11,620 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎంచుకున్న ప్యాకేజీని ప్రయాణం, ఏసీ గదులు, ప్రత్యేక షేరింగ్ వాహనాలు ఏర్పాటు చేస్తారు.












Click it and Unblock the Notifications