పులిచింతల ప్రాజెక్టు వద్ద మంత్రి దేవినేని
గత రెండు రోజులుగా గుంటూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 24 గంటల వ్యవధిలోనే పులిచింతలకు 5 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు పులిచింతల వద్దే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంగళవారం 16.3 టీఎంసీల నీటిమట్టం ఉండగా బుధవారం నాటికి 21.4 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీల వరకే నీటిని నిల్వ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ జలవనరుల శాఖతో మాట్లాడి నల్గొండ జిల్లాలోని రేబల్లి, నెమలిపురి, చింతిర్యాల, కృష్ణాపురం గ్రామాలను ఖాళీచేయించారు. గుంటూరులోని రేగులగడ్డ, గోవిందాపురం, బోధనం గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పులిచింతలలో 30 టీఎంసీల నీటిని నిల్వ చేయడం ద్వారా డెల్టాలో 2 కార్పొరేషన్లు, 8 మున్సిపాలిటీలతో పాటు వంద గ్రామ పంచాయతీల్లో లక్షల మందికి తాగునీటి అవసరాలు తీర్చవచ్చు.ఒక టీఎంసీ నీటితో డెల్టా ప్రాంతంలో 12 వేల ఎకరాలు సాగుచేయవచ్చు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ పులిచింతల ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ పులిచింతలకు పుష్కలంగా నీరు చేరిందని, దీనివల్ల డెల్టా రైతులకు పూర్తిస్థాయిలో నీరందించవచ్చని అన్నారు.












Click it and Unblock the Notifications