ఏపీలో 'ప్రత్యేక' రాజకీయం!: పవన్ కళ్యాణ్ ఇరుకున పడ్తున్నారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బిజెపి నేతలు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. ఏడాది దాటినా ఇప్పటి వరకు హోదా పైన స్పష్టత లేదు. ఏపీకి ప్రత్యేక హోదా అర్హత లేదని, ఇస్తామని, ఇంకా తేలలేదని... ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం విభజనకు ముందు కాంగ్రెస్, బిజెపిలు నాడు రాజ్యసభలో పోటీ పడ్డాయి. అయితే, విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి దాని పైన అస్పష్టమైన ప్రకటనలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్యేక హోదాకు తాము కట్టుబడి ఉన్నామని కొందరు బిజెపి నేతలు చెబుతున్నారు. మరికొందరు.. ప్రత్యేక హోదా అసాధ్యమని చెబుతున్నారు. ఇంకొందరు ఇంకా స్పష్టత లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు బిజెపికి మద్దతు పలికిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌ను, టిడిపిని నిలదీస్తున్నారు.

ప్రధాని మోడీ ప్రత్యేక హోదా పైన స్పష్టత ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే టిడిపి కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరమైతే రోడ్డెక్కాలని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదా కోసం మొన్నటి వరకు టిడిపి ఎంపీలు, టిడిపి కేంద్రమంత్రులు ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇటీవల వారి మాట మార్చారు! హోదా కంటే ఎక్కువే ఏపీకి సాయం చేస్తామని చెబుతున్నారని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు.
అంతకుముందు వరకు వారు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీయాల్సిందేనని పార్టీ అధినేత వద్ద చెప్పారని, కానీ ఆయన సముదాయించారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత వారు కేంద్రం హోదా కంటే ఎక్కువే సాయం చేస్తుందని చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం పైన ప్రత్యేక హోదా కోసం నిలదీశారని వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం ప్రత్యేక హోదాతోనే సరిపోదని, ఏపీకి ఇంకా ఎంతో కావాలని చెప్పారు. కేంద్రంతో సన్నిహితంగా ఉంటూనే సాధించుకుంటామని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా అర్హత లేదని కేంద్రం వైసీపీకి రాసిన లేఖలో పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విశాఖ బిజెపి ఎంపీ హరిబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ప్రకటించాలన్న విషయమై కేంద్రం డైలమాలో ఉందని చెప్పారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలా? ప్యాకేజీ ప్రకటించాలా? అన్న విషయమై ఆలోచనలు జరుగుతున్నాయన్నారు. హోదా అన్న పేరు లేకపోయినా ఒక్క రూపాయి నష్టం లేకుండా ప్యాకేజీలు ఇచ్చి భర్తీ చేస్తామన్నారు. హోదా విషయమై తుది నిర్ణయం తీసుకోలేదని ప్రస్తుతం ఎవరేం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలన్న విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందన్నారు. ఈ విషయమై ప్రజల సెంటిమెంటు దెబ్బతినకుండా నిర్ణయాలుంటాయన్నారు. ఆదివారం కేంద్రమంత్రి సదానంద గౌడ మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై ఎన్నో అడ్డంకులు
ఏపీకి ప్రత్యేక హోదా పైన ఎన్ని అడ్డంకులు ఉన్నాయి. త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఏపీకి హోదా ఇస్తే బీహార్ మరింత గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఏపీ కోసం ఇప్పుడే ప్రకటన చేస్తే బీహార్ ఎన్నికల్లో బిజెపికి ఎదురు దెబ్బ తగిలే అవకాశముంది.
అదే కాకుండా, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మిగతా పలు రాష్ట్రాలు అసంతృప్తితో ఉన్నాయి. వాటిని ఒప్పించాల్సి ఉంది. రాజ్యసభలో ప్రత్యేక హోదా పైన నాటి ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారని, కానీ చట్టంలో పెట్టకపోవడం ఇబ్బందికరంగా మారిందని బిజెపి చెబుతోంది.
ఏపీకి ప్రత్యేక హోదా పైన చట్టంతో పని లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇటీవల ఎపిసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. నాడు ప్రధాని ఇచ్చిన హామీ మేరకు దానిని నేటి కేంద్రం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేక హోదాపై ఒకరిపై మరొకరు!
నాడు ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చిన యూపిఏ ప్రభుత్వం చట్టంలో పెట్టుకపోవడం వల్లే ఇన్ని ఇబ్బందులని బిజెపి చెబుతోంది. చట్టంతో పని లేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇక, ఇటీవలి వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడని వైసిపి ఢిల్లీకి వెళ్లి దీక్ష చేయడాన్ని కాంగ్రెస్, టిడిపిలు ప్రశ్నించాయి. హోదా ఇవ్వకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి టిడిపి వైదొలగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్‌ను నిలదీస్తున్నా...
ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్‌ను విపక్షాలు, ప్ర్తత్యేక హోదా కోరుకుంటున్న సంఘాలు నిలదీస్తున్నాయి. అయితే, ఆయన ఇప్పటి వరకు దానిపై అంతగా స్పందించలేదు. అదే సమయంలో రాజధాని భూసమీకరణపై మాత్రం ట్విట్టర్లో వరుసగా చంద్రబాబు ప్రభుత్వానికి షాకిస్తున్నారు. రాజధాని భూసమీకరణ విషయంలో మాట్లాడుతున్న పవన్.. హోదా పైన ఎందుకు మాట్లాడటం లేదనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications