నోటుకు ఓటు: చంద్రబాబు నిరీక్షణా, నమ్మకమా?
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కారాలు మిరియాలు నూరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మౌనం వహించినట్లు కనిపిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తనపై చర్యలు తీసుకునే అధికారాలు లేవని అంటూ వచ్చిన ఆయన గత రెండు రోజులుగా ఏమీ మాట్లాడడం లేదు.
కెసిఆర్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నారనే మాట వినిపిస్తున్నా, నోటుకు ఓటు కేసు తీసుకోబోయే మలుపుల గురించి ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు, నిఘా విభాగం చీఫ్ అనురాధ, ఎసిబి చీఫ్ మాలకొండయ్యలతో ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన దాని గురించి ఏమీ మాట్లాడడం లేదు.
చంద్రబాబు మౌనంతో ఆయన ఏ విధంగా వ్యవహరించబోతున్నారనేది తెలియడం లేదు. ఢిల్లీలో కెసిఆర్‌పై తీవ్రంగా గర్జించారు. తనను అరెస్టు చేస్తే ఆ రోజే కెసిఆర్ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. తనపై చర్యలు తీసుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన అడిగారు.

ఎసిబి విచారణలో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, సెబాస్టియన్ ఏం చెప్పారనేది కూడా తెలియడం లేదు. కేసు వేగంగా ముందుకు సాగుతుందని భావిస్తుంటే, నత్తనడకను ఆశ్రయించిందనే భావన చోటు చేసుకుంది. తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని కూడా ఎసిబి ఇప్పటి వరకు నమోదు చేయలేదు. రేపూ మాపూ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈ స్థితిలో చంద్రబాబు తదుపరి అడుగులు ఎటు వేస్తారనేది ఆసక్తిగా మారింది. తనకు సమన్లు జారీ చేసి, తనను అరెస్టు చేసే ధైర్యం తెలంగాణ ఎసిబి చేస్తుందా అనే నమ్మకంతో ఆయన ఉండవచ్చునని కూడా అంటున్నారు. స్టీఫెన్‌సన్‌తో తాను జరిపినట్లు వెల్లడైన ఆడియో టేపులో డబ్బు ప్రస్తావన గానీ, ఓటు ప్రస్తావన గానీ లేదు. దీంతో చంద్రబాబు కేసులో ఇరుక్కునే అవకాశం లేదని అంటున్నారు. ఆ ధీమాతో చంద్రబాబు ఉండవచ్చునని కూడా అంటున్నారు. అయితే, ఎసిబి తదుపరి చర్యలను బట్టి చంద్రబాబు ముందుకు కదిలే అవకాశం లేకపోలేదని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications