తెలంగాణ విదేశమైతే, జపాన్‌కాదా: బాబుకి జగన్ పార్టీ, గవర్నర్‌పై కేఈ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మంగళగిరి శాసన సభ్యుడు ఆర్కే బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖజానాలో డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు తాత్కాలిక రాజధాని కోసం డబ్బులెందుకు దుబారా చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
లోటుపాట్లు చెబుతారనే ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని పక్కన పెట్టారని ఆరోపించారు. భూసమీకరణలో రెవెన్యూ మంత్రి ప్రమేయం లేకపోవడం దారుణమన్నారు. రాజధాని ప్రాంతంలో రెవెన్యూ మంత్రి పర్యటించక పోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.
నది ఒడ్డున అక్రమ స్థలాల జోలికి పోకుండా పేద ప్రజల భూములు లాక్కోవడం సమంజసమా అని ప్రశ్నించారు. తెలంగాణ విదేశమైనప్పుడు చంద్రబాబు దృష్టిలో జపాన్, సింగపూర్ విదేశాలు కావా చెప్పాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నిలదీశారు.

ఏపీ పట్ల గవర్నరు తీరు బాగా లేదు: కేఈ
ఆంధ్రప్రదేశ్ పట్ల గవర్నరు తీరు సరిగా లేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. తెలంగాణ వ్యవహారంపై గవర్నరు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పదేళ్లపాటు హైదరాబాద్‌పై ఏపీకి కూడా హక్కు ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వాడిన భాషనే వైయస్ జగన్ వాడుతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ తమపై రాళ్లు వేయకుండా రాజధాని నిర్మాణానికి రాళ్లు అందించాలన్నారు.
ప్రత్యేక హోదాపై కేంద్రం న్యాయం చేస్తుందని భావిస్తున్నామన్నారు. అసైన్డ్ భూములపై మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో ఉమ్మడి సర్వే చేస్తామన్నారు. అన్యాక్రాంతమైన గ్రామ కంటాలను స్వాధీనం చేసుకుంటామని, గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటే వాటిని తీసుకోమని చెప్పారు. అసైన్ భూముల లావాదేవీలపై లావాదేవీలు లేకున్నప్పటికీ కొందరు అమ్ముతున్నారన్నారు.












Click it and Unblock the Notifications