ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయంలో అనూహ్య మార్పులు - ఈసారి ఎవరూ సేఫ్ కాదా ?
ఏపీలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉండే జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇప్పుడు రాజకీయాలు అంతే వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా సొంత పార్టీల్ని అంటిపెట్టుకుని ఉన్న నేతలంతా ఇప్పుడు వేర్వేరు కారణాలతో ప్రత్యర్ధి పార్టీలకు ఫిరాయిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలు కూడా విధేయతల్ని పట్టించుకోకుండా, నేతల అభిప్రాయాలు తీసుకోకుండా మార్పులు చేస్తూ పోతున్నాయి. దీంతో ఎన్నికల ముందు ఎవరూ తాము సేఫ్ అని చెప్పుకోలేని పరిస్ధితి నెలకొంటోంది.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు పలు నియోజకవర్గాల్లో రాజకీయాల్ని సమూలంగా మార్చేయబోతున్నాయి. విజయవాడ పశ్చిమ, సెంట్రల్, పెనమలూరు, తిరువూరు, పెడన, మైలవరం, అవనిగడ్డ, గన్నవరం ఇలా చాలా సీట్లలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పార్ధసారధి, రక్షణనిధి ఇప్పటికే సీట్లు కోల్పోతుండగా.. మిగిలిన స్ధానాల్లోనూ త్వరలో భారీ మార్పులు జరగబోతున్నాయి. అలాగే టీడీపీలోనూ విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మార్పు రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు.

నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారన్న కారణంతో వైసీపీ సిట్టింగ్ లను మారుస్తుంటే, వారినే తీసుకుని రాజకీయం చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వీరి పరిస్ధితి ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. అలాగే కమ్మ సామాజిక వర్గం ప్రభావం తీవ్రంగా ఉండే విజయవాడ ఎంపీ సీటు పరిధిలో టీడీపీని కాదని సిట్టింగ్ ఎంపీ వైసీపీ నుంచి పోటీ చేస్తుండటంతో ఆయన పరిస్ధితి ఏంటన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల వేళ మారుతున్న పరిస్ధితులతో గన్నవరం ఎమ్మెల్యే వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైలెంట్ అయిపోతున్నారు.
బందరు ఎంపీ సీటును జగన్ తనకు సన్నిహితుడైన బాలశౌరిని కాదని టీడీపీ నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వంగవీటి రాధాకు కేటాయిస్తారన్న వార్తలతో ఇక్కడి పరిస్ధితులు తీవ్రంగా ప్రభావితం కాబోతున్నాయి. అలాగే విజయవాడ నగర పరిధిలోని తూర్పు సీటులో గద్దె రామ్మోహన్ ను ఓడించేందుకు దేవినేని అవినాష్ ను ఎంచుకుని రాజకీయాలు చేస్తున్న తరుణంలో గత ఎన్నికల అభ్యర్ధి బొప్పన భవకుమార్ పార్టీని వీడబోతున్నారు.
పెనమలూరులో సారధి స్ధానంలో పెడన నుంచి తెచ్చిన జోగి రమేష్ కు కాకుండా తమకే సీటు కేటాయించాలని కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ ఒత్తిడి తెస్తున్నారు. అదే పెనమలూరులో టీడీపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ .. తాజా పరిణామాలతో ఆ స్ధానంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సిట్టింగ్ పార్ధసారధిపై గుర్రుగా ఉన్నారు. దీంతో పెనమలూరు పంచాయతీ టీడీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. ఇలా ఎక్కడ చూసినా అభద్రతా భావమే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications