విభజనలో మలుపు: కిరణ్ ప్రోరోగ్ అస్త్రం, స్పీకర్‌కు చెక్!
హైదరాబాద్/న్యూఢిల్లీ: విభజన అంశం కొత్త మలుపు తిరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు. ప్రోరోగ్ ద్వారా అసెంబ్లీ భేటీకి అడ్డుకట్ట వేయడం ద్వారా విభజనను జాప్యం చేసే యోచనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో విభజన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసన, పరిపాలన వ్యవస్థల మధ్య సంకుల సమరానికి కారణమయ్యే సంకేతాలు గోచరిస్తున్నాయంటున్నారు.
వివరాల మేరకు... రాష్ట్ర్ట్రపతి పంపే విభజన ముసాయిదా బిల్లు శాసనసభలో చర్చకు రాకుండానే వచ్చినా ఎటూ తేల్చకుండానే అటకెక్కించేందుకు కిరణ్ సరికొత్త వ్యూహం పన్నారంటున్నారు. అసెంబ్లీ సమావేశం కాకుండా అడ్డుకోవడం, అది వీలుకాకపోతే బిల్లుపై చర్చను వీలైనంత జాప్యం చేయడం అన్నవి ఈ వ్యూహంలోని ప్రధానాంశాలు అంటున్నారు. ఇందులో భాగంగా ఆయన ఏకంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తోనే తలపడేందుకు సిద్ధపడుతున్నారట. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టించే దిశగానూ యోచిస్తున్నారట.

రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు ఈ నెల్లోనే శాసనసభకు రానుంది. దీన్ని ఎదుర్కోడానికి కిరణ్ ఎవరూ ఊహించని విధంగా ప్రొరోగ్ అస్త్రాన్ని బయటికి తీశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసి సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత, సమీప భవిష్యత్తులో మళ్లీ సమావేశాలు లేకపోతే గవర్నర్ దాన్ని ప్రొరోగ్ చేస్తారు. 'సభను ప్రొరోగ్ చేయవచ్చు' అని శాసనసభ కార్యదర్శి నుంచి ఒక నోట్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళుతుంది.
ముఖ్యమంత్రి దాన్ని గవర్నర్‌కు పంపి ప్రొరోగ్ చేయాలని సిఫారసు చేస్తారు. ఆ వెంటనే గవర్నర్ సభను ప్రొరోగ్ చేస్తారు. ప్రొరోగ్ అయిన సభను తిరిగి సమావేశ పరచాలంటే గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి సిఫారసు తప్పనిసరి. ప్రొరోగ్ కాని పక్షంలో, స్పీకర్ ఎప్పుడైనా తనంతట తాను అసెంబ్లీని సమావేశపరచవచ్చు. అసలు విషయమేమిటంటే ప్రస్తుతం సభ ప్రొరోగ్ కాలేదు.
శాసనసభ మలివిడత బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది జూన్ పది నుంచి 21వ తేదీ వరకు జరిగాయి. ఆనవాయితీ ప్రకారం అయితే వారంలోపే సభ ప్రొరోగ్ కావాల్సి ఉంది. కానీ, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగానీ, స్పీకర్ కార్యాలయంగానీ పట్టించుకోలేదు. ఐదు నెలలు గడిచినా నేటిదాకా సభ ప్రొరోగ్ కాకుండా అలాగే ఉండిపోయింది. అంటే విభజన బిల్లు వస్త్తే ఇప్పటికిప్పుడు సభను సమావేశపరిచే అధికారం స్పీకర్ చేతిలోనే ఉంది.
సభ సమావేశమయ్యాక చర్చ ఎలా జరిగినప్పటికీ రాష్ట్రపతికి నివేదిక వెళ్తుంది. దానినే శాసనసభ అభిప్రాయంగా పరిగణించి బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి కేంద్రానికి మార్గం సుగమమవుతుంది. దీన్ని గుర్తించిన కిరణ్, అసాధారణ జాప్యం చేసి, పార్లమెంటు ముగిసేలోగా అసెంబ్లీ అభిప్రాయాన్ని కేంద్రానికి పంపకుండా ఉండే ఎత్తుగడ రచించారు. ఇందులో భాగంగా అసెంబ్లీని సమావేశపరిచే అధికారాన్ని స్పీకర్ చేతిలోంచి తన (ప్రభుత్వం) చేతిలోకి తీసుకునేలా పావులు కదిపారంటున్నారు.
'వర్షాకాల సమావేశాలు ఇంత వరకూ ప్రొరోగ్ కాలేదు. వాటిని ప్రొరోగ్ చేయడానికి వీలుగా నోట్ పంపించండి' అంటూ ప్రభుత్వం మూడు వారాల క్రితమే అసెంబ్లీ కార్యదర్శికి లేఖ పంపింది. సాధారణ పరిస్థితుల్లో అయితే, ఈ పాటికే అసెంబ్లీ కార్యదర్శి నుంచి జవాబు రావడం, అది ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు వెళ్లిపోవడం, అసెంబ్లీ ప్రొరోగ్ అవడం ఈ పాటికే జరిగిపోయేవి.
ప్రొరోగ్‌పై ప్రభుత్వం నుంచి లేఖ అంది మూడువారాలు గడిచినా స్పీకర్ కార్యాలయం స్పందించలేదు. ప్రొరోగ్ నోట్‌ని సర్కారుకు పంపలేదు. అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అసెంబ్లీని ఎప్పుడైనా సమావేశపరచడానికి వీలుగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రొరోగ్‌పై వ్యూహాత్మక మౌనం దాల్చినట్లు కిరణ్ అనుకూల వర్గాలు భావిస్తున్నాయంటున్నారు.
సిఎం సూచన మేరకు శాసనసభను ఇప్పుడు ప్రొరోగ్ చేస్తే మళ్లీ సమావేశపరిచేందుకు ముఖ్యమంత్రి ద్వారానే గవర్నర్‌కు లేఖ వెళ్లాలి. సిఎం లేఖ లేకుండా గవర్నర్ తనంతట తాను అసెంబ్లీ భేటీకి నోటిఫికేషన్ జారీ చేయడం నిబంధనల ప్రకారం కుదరదు. అందుకే ప్రొరోగ్‌కు అనుకూలంగా నోట్ పంపించాలని భావిస్తున్నారట. అయితే స్పీకర్ స్పందనపై సిఎం తీవ్ర అసహనంతో ఉన్నారట.












Click it and Unblock the Notifications