టిడిపికి మంచి చేసిన రోజా: చంద్రబాబు ఉచ్చులో పడ్డ జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో పడ్డారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రోజా అంశమే ప్రధానంగా వినిపిస్తోంది.
గత బడ్జెట్ సమావేశాల సమయంలో జగన్ ప్రసంగం, హావభావాలతో పోల్చుకుంటే, ఈసారి అతను చాలా పరిణితి చెందినట్లుగా కనిపిస్తోందనే వాదనలు ఉన్నాయి. అయితే, చంద్రబాబు ఉచ్చు నుంచి మాత్రం ఆయన తప్పించుకోలేకపోయారని అంటున్నారు.
ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ అంశాలు పక్కన పెట్టి కేవలం రోజా అంశాన్నే వైసిపి ప్రస్తావించడాన్ని చాలామంది ప్రస్తావిస్తున్నారు. అయితే దానికి వైసిపి వద్ద కూడా సమాధానం ఉంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రోజా సభలో ఉండకుంటే ఎలా అని అంటున్నారు.

ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, విపక్షం వాటి గురించి లేవనెత్తకుండా కేవలం రోజా అంశాన్ని ఎందుకు పట్టుకుందని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. విభజన నేపథ్యంలో ఏపీలో ఎన్నో సమస్యలు, అంశాలు ఉన్నాయని చెబుతున్నారు.
శాసన సభలో జగన్ ప్రసంగం పైచేయి సాధించినట్లే కనిపించినప్పటికీ.. మంత్రుల విషయంలో రాజధాని భూముల ఆరోపణలు చేయడం, వ్యవస్థల పైన కామెంట్ చేయడం వంటి వాటి కారణంగా చంద్రబాబు పైచేయి సాధించారని అంటున్నారు. జగన్ ఒక్క పాయింటును ప్రభుత్వం క్యాష్ చేసుకుందని అంటున్నారు.
మరోవైపు, రోజా అంశాన్నే పట్టుబట్టడం కూడా సరికాదని టిడిపి నేతలు అంటున్నారు. రోజా సస్పెన్షన్ రూల్ ప్రకారమే జరిగిందని చెబుతున్నారు. ఆమె సస్పెన్షన్ సరికాదని వైసిపి చెబుతోంది. రోజా అంశంపై టిడిపి, వైసిపిల మధ్య వాగ్యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు పైన ఇరు పార్టీల మధ్య మాటకుమాట కనిపిస్తోంది.
వైసిపి సమావేశాలను బహిష్కరించడం, వాకౌట్ చేయడం, నిరసనలు తెలపడం, సభకు వెళ్లకపోవడం వంటి వాటి వల్ల ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. తద్వారా జగన్.. చంద్రబాబు ప్రభుత్వానికి మంచి చేశాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications