తుఫాన్: విశాఖ సెజ్ ఐటి కంపెనీలు విలవిల
రాజమండ్రి: హుధుద్ తుఫానుకు విశాఖ నగరం విలవిల్లాడుతున్న నేపథ్యంలో ఐటి కంపెనీలు రాజమండ్రి, విజయవాడలను ప్రత్యామ్నాయంగా చేసుకుని పనిచేసేందుకు సిద్ధమవుతున్నాయ. రుషికొండ ఐటి సెజ్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలు తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. దీంతో మరో వారం వరకు విశాఖలోని ఐటి సెజ్‌లో ఉన్న తమ కార్యాలయాల్లో పనిచేయలేని పరిస్థితులు ఉన్నాయి.
దాంతో అక్కడి కొన్ని కంపెనీలు ఇప్పటికే రాజమండ్రి, విజయవాడ వచ్చి తాత్కాలికంగా కార్యాలయాలను ప్రారంభించి పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే రాజమండ్రిలోని ఎస్‌ఏ ఇన్ఫోటెక్ కంపెనీకి విశాఖ నగరంలోని ఇన్‌స్పైరెడ్జ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుండి 30మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వచ్చి తాత్కాలికంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.

అమెరికాలోని వివిధ సంస్థలకు ఐటి సేవలు అందించే తమ కంపెనీ సేవలు ఒక్కరోజు ఆగినా అమెరికాలోని కంపెనీల నుండి ఇబ్బందులు తలెత్తుతాయని ఇన్‌స్పైరెడ్జ్ సంస్థ వైస్‌ప్రెసిడెంట్ ఎన్ నరేంద్ర చెప్పారు. కాగా, ఐటి కంపెనీలకు విద్యుత్, అత్యంత వేగంతో కూడిన ఇంటర్నెట్ ఉంటే సరిపోతుందని, అలాంటి పరిస్థితులు రాజమండ్రిలో ఉన్నాయని ఎస్‌ఏ ఇన్ఫోటెక్ సిఇఓ అనిల్‌కుమార్ కురుకూరి చెప్పారు.
అన్నింటికీ మించి రాజమండ్రి నగరానికి తుపాన్ల బెడద లేదన్నారు. అందువల్ల రాజమండ్రి నగరం ఐటి రంగానికి అనువైందని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే చిన్నా పెద్దా ఐటి కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 70శాతం మంది ఉంటే, వీరిలో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారు 30శాతం ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని ఐటి రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 1996లో తీవ్ర పెనుతుపాను హరికేన్ కోనసీమపై విరుచుకుపడి తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని కలిగించినపుడు కూడా రాజమండ్రి నగరంపై కనీస ప్రభావాన్ని కూడా చూపించలేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి ప్రాంతాన్ని సురక్షితంగా భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications