ఎందుకిలా?: పవన్ కళ్యాణ్ ‘ఓటమి’పై విస్తృత చర్చ!
హైదరాబాద్: ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన చేసే ప్రతీ వ్యాఖ్యపై విస్తృత చర్చే జరుగుతోంది. ఆయన రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి రావడమే సంచలనం కాగా, ఆయన మాట్లాడే మాటలు కూడా అంతే సంచలనంగా మారుతున్నాయి.
Recommended Video

తాజాగా, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి విస్తృత చర్చకు దారితీశాయి. ఇటీవల పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ తనకు ఓటమి అంటే భయం లేదని స్పష్టం చేశారు. పలుమార్లు ఇదే మాటను చెప్పడంపై విశ్లేషకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

చర్చకు దారితీసిన ఓటమి
అంతేగాక, తాజాగా ‘అజ్ఞాతవాసి' ఆడియో ఫంక్షన్‌లోనూ ఓటమి గురించి పవన్ ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఈ ‘ఓటమి' అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లోనూ కీలక చర్చ జరుగుతోంది.

ఆ తపనే..
అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్‌లో పవన్ మాట్లాడుతూ.. తాను నిరాశకు గురైనప్పుడు తన వద్ద ఎవరూ లేరని, తాను పాపులర్ అవుతున్నకొద్దీ తనను ద్వేషించే వాళ్లు ఎవరో తెలిసిందని పవన్ వ్యాఖ్యానించారు. దేశం కోసం ఏదో చేయాలన్న తపనే తనను రాజకీయాల వైపు మళ్లించిందన్నారు.

ఓటములు కొత్తకాదు
తనకు ఓటములు కొత్త కాదని, కానీ ఓడిపోయే ముందు పెద్ద దెబ్బే కొడతానని పవన్ వ్యాఖ్యానించారు. అజ్ఞాతవాసి పూర్తిగా సినీ వేడుక కావడంతో రాజకీయాల గురించి పవన్ ఇంతకు మించి మాట్లాడకపోయినా.. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టకముందే ఆయన ఓటమి గురించి ఎందుకు మాట్లాడతున్నారన్న చర్చ సాగుతోంది.

దెబ్బలు తగిలిన ప్రతీసారి
సాధారణంగా పవన్ ఆడియో ఫంక్షన్లలో ఎప్పుడు మాట్లాడినా తన సినిమాల గురించి, వ్యక్తిగత అభిరుచుల గురించి మాట్లాడతారు. కానీ, ఈసారి ఓటమి గురించి, తనను ద్వేషించే వారి గురించి మాట్లాడారు. ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ మళ్లీమళ్లీ ప్రయత్నించి విజయం సాధిస్తానని జనసేన అధినేత చెప్పుకొచ్చారు.

జనసేన ప్రభావం ఉండకుండాపోదు
అయితే, ఓటమి గురించి ముందే తెలిసిన వారు కూడా గంభీరంగా ఉంటారు. తమ కార్యకర్తలులో నమ్మకం కలిగిస్తారు. కానీ, రంగంలోకి దిగకముందే పవన్ ఓటమిని అంగీకరించడం వెనక తాను రాజకీయాలకు సూటవనన్న సంకేతం కూడా అంతర్లీనంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, పవన్ తన శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకుని ఈ వ్యాఖ్యలను చేసివుంటారని మరికొందరు చెబుతున్నారు. పవన్ ప్రభావం ఏపీ రాజకీయాల్లో బలంగా ఉండనుందని అంటున్నారు. ఇతర పార్టీల గెలుపుపై ఆయన ప్రభావం కీలకంగా మారనుందని అభిప్రాయపడుతున్నారు. పవన్ కూడా తాను పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చేలా ఎన్నికల్లో గెలవకపోయినా.. తమ పార్టీ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుందని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications