మోడీ బాటలో బాబు! మంత్రులకు గ్రేడ్స్: 19న టీలో సర్వే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం నాడు ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీఆర్ క్యాంటీన్లు, దేవాలయాల కమిటీలు, నామినేటెడ్ పోస్టుల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్‌కు సంబంధించి ఏపీ నేతలకు ఆవేశపడవద్దని చెబుతూ.. తెలంగాణ టీడీపీ నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
అంతేకాదు, మంత్రుల పని తీరు పైన కూడా చంద్రబాబు దృష్టి సారించారు. చంద్రబాబు మంత్రులకు పని తీరును బట్టి గ్రేడింగ్ ఇవ్వనున్నారట. ఏ, బీ, సీ గ్రేడ్స్ ఇవ్వనున్నారట. పని బాగా చేయని మంత్రులకు ఉద్వాసన పలుకుతానని కేబినెట్ సమావేశంలో చంద్రబాబు హెచ్చరించారట. జిల్లాల వారిగా వెళ్లి బాగా పని చేయడం నుండి వారి పని తీరు వరకు పరిశీలించి గ్రేడింగ్ ఇస్తారట. పని చేయకుంటే మాత్రం తొలగించేందుకు కూడా వెనుకాడేది లేదని చెప్పారట.

మంత్రులు తమ తమ శాఖల పైన పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని సూచించారు. ప్రజల అంచనాలకు తగ్గట్లుగా పని చేయాలని హితవు పలికారు. మంత్రి రావెల కిషోర్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మరింత కష్టపడాలని చంద్రబాబు సూచించారని రావెల చెప్పారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు వంద రోజుల డెడ్ లైన్ విధించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.
19న తెలంగాణ రాష్ట్రంలో సర్వే
ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సర్వే నిర్వహణ పైన 11వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సర్వే ఖర్చుల కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు కేటాయించారు. సర్వేలో 84 లక్షల మంది కుటుంబాల వివరాలను సేకరించాలని సూచించారు.












Click it and Unblock the Notifications