ఏపీలో మద్యం ధరల తగ్గింపు వెనుక- తెలంగాణ కంటే చౌక : జగన్ హామీ పైన ఎఫెక్ట్ పడుతోందా.!!
ఏపీ ప్రభుత్వం మద్యం ధరల తగ్గింపుకు కారణమేంటి. ఆకస్మికంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. షాక్ కొట్టే ధరలతో మద్యం దూరం చేస్తున్నామి చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధరలు తగ్గింపు నిర్ణయం ఎందుకు తీసుకుంది. ఈ చర్చ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా సాధారణ ప్రజల్లోనూ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చే ముందు దశల వారీగా మద్యాపాన నిషేధం పైనా హామీ ఇచ్చారు. బెల్టు షాపులను నియంత్రించారు. అయితే, ఇప్పుడు సడన్ గా రాష్ట్రంలో మద్యం ధరల్ని ప్రభుత్వం 15- 20శాతం తగ్గించింది.

ఇప్పుడు ధరల తగ్గింపు ఎందుకు
బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌పై కనీసం రూ.20 నుంచి రూ.50 వరకూ, ఫుల్ బాటిల్‌పై రూ.120 నుంచి రూ.200 వరకూ తగ్గుదల అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. చీప్‌లిక్కర్ బ్రాండ్లపై అధికంగా, ప్రీమియం బ్రాండ్లపై తక్కువగా ధరలు తగ్గుతాయి. చీప్‌లిక్కర్‌లోని కొన్ని రకాల బ్రాండ్ల ధర తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువగా, మరికొన్ని బ్రాండ్ల ధర తెలంగాణతో సమానంగా ఉండేలా సవరించారు. లిక్కర్ ధరలు తగ్గించటంతో వినియోగం పెరిగి..ఆదాయం సైతం పెరుగుతుందనే అంచనాలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

జీవోలో పేర్కొన్న కారణాలపైనా..
మద్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నియంత్రణ, నాటుసారా అరికట్టేందుకు మద్యం ధరలు తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మద్యం వినియోగం తగ్గించేందుకు, అక్రమరవాణా స్మగ్లింగ్, నాటుసారాను అరికట్టేందుకు వీలుగా ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ధరలు తగ్గిస్తున్నాం' అని ఉత్తర్వుల్లో వివరించారు. ప్రజల్ని మద్యం వ్యసనం నుంచి దూరం చేసేందుకే ధరలు పెంచామంటూ ఇప్పటి వరకూ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే, అధికాదాయం కోసం ధరల్ని తగ్గిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ధరలు తగ్గించి..ఆదాయం పెంచుకోవటానికా
ఒక్కో మద్యం కేసు మూల ధర రూ.400 నుంచి రూ.2,500 వరకూ ఉండే రకాలపై 130 శాతం స్పెషల్ మార్జిన్ రేటు ఉండేది. ఆ కేటగిరీని నాలుగు విభాగాలుగా విభజించి 110 శాతం నుంచి 130 వరకూ స్పెషల్ మార్జిన్‌రేటు విధించారు. ప్రధానంగా ఒక్కో మద్యం కేసు మూల ధర రూ.400 నుంచి రూ.1,029, రూ.1,657 నుంచి రూ.1,830 వరకూ ఉన్న రకాలపై స్పెషల్ మార్జిన్ రేటు 20 శాతం, రూ.1,562 నుంచి రూ.1,657 ఉన్న రకాలపై 10 శాతం తగ్గించారు. బీరుపై 70 శాతం ఉన్న వ్యాట్‌ను 40 శాతానికి తగ్గించారు. వీటిన్నింటి వల్ల మద్యం ధరలు తగ్గనున్నాయి.

మద్యపాన నిషేధ హామీ పైన ప్రభావం పడుతుందా
ఇక, ఏపీలో కొంత కాలంగా మాయమైన ప్రముఖ బ్రాండ్ల మద్యం సైతం తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు చెబుతున్నారు. మద్యానికి సామన్యుడు బలి కాకూడదనే ఉద్దేశంతోనే మద్యం ధరలు షాక్ కొట్టేలా నిర్ణయం తీసుకున్నామని సీఎం సైతం చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు ధరలు తగ్గించటం పైన ప్రభుత్వం కొన్ని కారణాలు చెప్పినా...రాజకీయంగా మాత్రం విమర్శలు తప్పేలా లేదు. ఈ ఏడాది పది వేల కోట్లు మద్యం ద్వారా ఆదాయం వచ్చిందని.. మిగిలిన కాలానికి 15 వేల కోట్ల రూపాయాలు తెచ్చుకోవటమే లక్ష్యంగా ఆ పెంపు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీని పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications