చంద్రబాబుకు ఐటీ నోటీసులు - ముడుపుల అభియోగాలు..!!
ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ 118 కోట్లు ముడుపులు తీసుకున్నారనే అభియోగాల కింద చంద్రబాబుకు నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రముఖ జాతీయ దిన పత్రిక పేర్కొంది. షోకాజ్ నోటీసుల పై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు ఆ కధనంలో పేర్కొన్నారు.
సంస్థల నుంచి ముడుపులు : ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారనేది చంద్రబాబు పైన అభియోగాలు ఉన్నాయి. అమరావతి అమరావతి కాంట్రాక్టర్ లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు అందాయనేది ఆరోపణగా జాతీయ పత్రిక తన కధనంలో పేర్కొంది. షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్ధసాని నివాసాల్లో తనిఖల సమయంలో ఈ విషయం బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారని వివరించారు.

ఐటీ నోటీసులు జారీ : దీంతో, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థల నుంచి వచ్చిన రూ 118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఐటీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
సంస్థల నుంచి వచ్చిన ₹118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ఐటీ శాఖ ప్రస్తావించిందని సమాచారం. 2019లో ఐటీ శాఖ అధికారులు చంద్రబాబు పీఏగా శ్రీనివాస్ నివాసంలో సోదాలు చేసారు. ఆ సమయంలో కీలక సమాచారం సేకరించారు.

సోదాలతో సమాచారం : షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నివాసంలో సోదాల సమయంలో మరింత సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాల్లో లభించిన ఆధారాల మేరకు సంబంధిత వ్యక్తులను విచారించారు. తాము సేకరించిన సమాచారం పై వారి వాంగ్మూలాలను నమోదు చేసారు. వీటి ఆధారంగా ఐటీ అధికారులు ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు పంపినట్లు ఆ కధనంలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications