రాజకీయ లబ్ధికే: పురంధేశ్వరి, కావూరిలపై విహెచ్ ఫైర్
న్యూఢిల్లీ: గుజరాత్‌లో ముస్లిం సోదరులను ఊచకోత కోసిన బిజెపి నేత నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా సీమాంధ్ర నాయకులు బలపర్చడం మన దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలో మోడీని బలపర్చడం బాధాకరంగా ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సీమాంధ్ర నేతలు తెలంగాణకు మద్దతు ఇచ్చిన బిజెపికి ఎందుకు చేరుతున్నారని హనుమంతరావు ప్రశ్నించారు. మాజీ కేంద్ర మంత్రులు పురందేశ్వరీ, కావూరి సాంబశివరావులపై ఆయన మండిపడ్డారు. వారు సమైక్య పార్టీలో ఎందుకు చేరలేదని ఆయన ప్రశ్నించారు.

వాళ్లకు పదవి కాంక్ష అని, ఇలాంటి నాయకులకు ప్రజలు సరైన విధంగా బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ప్యాకేజీలు, స్పెషల్ కేటగిరి ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి చెప్పారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చారో సీమాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలకు వివరిస్తారని హనుమంతరావు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
రాజకీయ ప్రయోజనం కోసమే పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు కాంగ్రెసు పార్టీని వీడారని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్ర నినాదంతో పనిచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీలో చేరితే ఏమైనా అర్థం ఉంది గానీ విభజనకు సహకరించిన బిజెపిలో చేరడం సరైంది కాదని ఆయన అన్నారు. పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు తాము విజయం సాధించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసును వీడారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications