నన్ను ఎగతాళి చేశారు: 27 ఏళ్లు పూర్తయిన వేళ.. చంద్రబాబు ఎమోషనల్..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాత రోజులను గుర్తు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, తీసుకున్న నిర్ణయాల గురించి ఏకరువు పెట్టారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన వరుస పోస్టులను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి ఫొటోను తన ట్వీట్లకు జత చేశారు.
Recommended Video

మొదటిసారిగా సీఎంగా..
అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నుంచి ప్రభుత్వాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1వ తేదీన తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 27 సంవత్సరాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్నానని చంద్రబాబు చెప్పారు. అప్పటి నుంచి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశానని, ఈ పద్నాలుగేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయని అన్నారు.

జవాబుదారి పాలన..
ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి తాను ఆలోచించింది ప్రజలకు జవాబుదారీ పాలన అందించడం గురించేనని చంద్రబాబు పేర్కొన్నారు. పాలకులు అంటే ప్రజలకు సేవకులు అని చెప్పిన ఎన్టీఆర్ నినాదాన్ని అమలులోకి తెచ్చానని, దీనికోసం ప్రజల వద్దకు పాలనతో అధికార యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేశానని చెప్పారు. అది- ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచిందని, జన్మభూమి వంటి కార్యక్రమాలతో ప్రజలను కూడా పాలనలో భాగస్వాములు చేశామని అన్నారు.

విజన్ 2020..
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలం పాటు మనుగడ సాగించేలా స్పష్టమైన ప్రణాళిక ఉండాలని, ఆ ఉద్దేశంతోనే తాను 'విజన్-2020' అనే డాక్యుమెంట్‌ను రూపొందించానని చంద్రబాబు అన్నారు. అప్పట్లో ఎగతాళి చేసినవారే, ఆ తర్వాత ఆ విజన్ డాక్యుమెంట్ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నారని చెప్పారు. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను తీసుకువచ్చి, ప్రపంచ ఐటీ రంగం దృష్టి రాష్ట్రంపై పడేలా చేశానని, దీనివల్ల లక్షలాది ఐటీ ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇంజినీరింగ్ కాలేజీలు..
ఐటీ ఉద్యోగాలకు నిపుణులను సిద్ధం చేయడానికి పెద్ద ఎత్తున ఇంజినీరింగ్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చామని చంద్రబాబు అన్నారు. అలాగే విద్యారంగంలో సమూల మార్పులు చేసి విద్యను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేశామని పేర్కొన్నారు. ఆ రోజు తాను పడిన కష్టానికి ఫలితంగా ఈ రోజు ఒక రైతు బిడ్డ నుంచి ఒక కార్మికుడి కొడుకు వరకు లక్షలాది మంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తోన్నారని, తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు.

నాకెంతో తృప్తి..
అమెరికాలో ఎక్కువ ఆదాయం పొందుతోన్న భారతీయుల్లో 30 శాతం మంది తెలుగువారే అన్నమాట విన్నప్పుడు తన కెంతో తృప్తిగా అనిపిస్తుందని చంద్రబాబు చెప్పారు. అప్పట్లో పదేళ్ల పాటు దేశంలో ఎవరి నోట విన్నా ఆంధ్రప్రదేశ్ అనే మాటే వినిపించేదని, రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు, సంస్థలు దేశం దృష్టిని ఆ స్థాయిలో ఆకర్షించాయని అన్నారు.

సంపద సృష్టి..
పెరుగుతున్న మన అవసరాలు తీరాలంటే సంపద సృష్టి జరగాలన్నది తాను చేసిన మరో ఆలోచన అని చంద్రబాబు తెలిపారు. ఏపీకి వచ్చే సంస్థల కోసం మౌలిక రంగాన్ని అభివృద్ధి చేశామని, అత్యుత్తమ విధానాలను పాలసీలను తీసుకు వచ్చామని అన్నారు. అందుకు ఉదాహరణ సైబరాబాద్ నగర నిర్మాణమని గుర్తు చేశారు. ఇప్పుడు సైబరాబాద్ దేశ విదేశాల్లోని అనేక సంస్థలకు కీలక వేదికగా నిలిచిందని వ్యాఖ్యానించారు.

నా ఆలోచనలకు వాజ్‌పేయి ప్రాధాన్యత..
అలాగే కొన్ని రంగాల్లో సంస్కరణలను తీసుకుని రావాల్సిన అవసరం చాలా ఉందని అనిపించిందని, ఆ దిశగా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు వివరించారు. అదే సమయంలో తన ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండటం కలిసొచ్చిందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఓపెన్ స్కై పాలసీ, టెలికాం పాలసీ, స్వర్ణ చతుర్భుజి రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, సూక్ష్మ సేద్యం వంటివి దేశానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర వహించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు.

అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా..
అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తను రాష్ట్రపతిగా ఎంపిక చేసుకోవడంలో తన పాత్ర ఉండటం మధుర జ్ఞాపకమని చంద్రబాబు చెప్పారు. రంగరాజన్ వంటి వారిని గవర్నర్‌గా ఏపీకి తెచ్చుకున్నామని వివరించారు. బాలయోగిని దేశానికి తొలి దళిత స్పీకర్‌గా, ఎర్రన్నాయుడిని కేంద్రమంత్రిగా నియమించుకున్నామని, తెలుగుదేశం ఆత్మగా ఉండే సామాజిక న్యాయాన్ని మరింత విస్తృత పరచగలిగామని చంద్రబాబు వివరించారు.

విభజన తరువాత..
రాష్ట్ర విభజన తర్వాత 2014 లోనూ ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రజలు బాధ్యత ఇవ్వగా.. లోటు బడ్జెట్ రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించి చూపించామని, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా నిర్మించే కృషి చేశామని చంద్రబాబు చెప్పారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం ద్వారా నదుల అనుసంధానం అనే కీలక ప్రక్రియను మొదలు పెట్టామని అన్నారు. అన్న క్యాంటీన్, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, విదేశీ విద్య, చంద్రన్న బీమా వంటి వినూత్న సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచామని చెప్పారు.

భావితరాల ఉజ్వల భవిష్యత్తు
ముఖ్యమంత్రిగా తాను ఏం చేసినా భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసమేనని, తన లక్ష్యం అదేనని తేల్చి చెప్పారు. దాదాపు 14 సంవత్సరాల పాలనా కాలంలో ముఖ్యమంత్రిగా తాను సాధించిన విజయాలు తనవి కావని, అవి తెలుగు ప్రజలకు చెందుతాయని అన్నారు. తాను కేవలం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, అధికారాన్ని వారికి మంచి చేయడానికి సద్వినియోగం చేసుకున్నానంతేనని చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్లు పెట్టారు.












Click it and Unblock the Notifications