వీర్రాజుపై హైకమాండ్ కు ఫిర్యాదు - తెలంగాణ నేతలు సైతం : చీప్ లిక్కర్ వ్యాఖ్యల కలకలం..!!
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చిక్కుల్లో పడ్డారా. ఆయన పైన సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేసారా. ఇప్పుడు పార్టీలోనే ఈ చర్చ మొదలైంది. విజయవాడలో జరిగిన ప్రజాగ్రహ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా లో ఆయన చేసిన వ్యాఖ్యల పైన సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభ ముగిసిన తరువాత పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక, సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది.

వీర్రాజు వ్యాఖ్యల కలకలం
సోము వీర్రాజు సభలో చేసిన చీప్ లిక్కర్ పైన వ్యాఖ్యలు..తాగేవారు కోటి మంది ఉన్నారు.. వారిని బీజేపీకి ఓటు వేయండి.. చీప్ లిక్కర్ రూ 70 కే అందిస్తాం.. పరిస్థితి సహకరిస్తే రూ 50 కే అందిస్తామంటూ చెప్పటం పైన ఇప్పుడు చర్చ సాగుతోంది. దీని పైన రాష్ట్రంలోనే కాకుండా.. జాతీయ స్థాయిలో కొందరు ప్రముఖులు ట్వీట్లు చేసారు. ఇది బీజేపీ జాతీయ విధానామా అంటూ ప్రశ్నించారు. దీని పై న అసలు వీర్రాజు ఏం మాట్లాడారంటూ ఆ సభకు హాజరైన ముఖ్య నేతలను పార్టీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ట్రోలింగ్
ఇక, తెలంగాణలో టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్న సమయంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల ను కేటీఆర్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేయటం ద్వారా తాము సమాధానం ఇవ్వలేకపోయామంటూ తెలంగాణ బీజేపీ నేతలు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సభకు స్పందన బాగుందని భావిస్తున్న సమయంలో సోము వీర్రాజు వ్యాఖ్యల పై మాత్రం సభలో పాల్గొన్న పార్టీ నేతలు తప్పు బడుతున్నారు. వైసీపీ - టీడీపీ లను సమాన దూరంగా ఉంచుతామనే సంకేతాలు ఇచ్చేలా సభ సాగిందని నేతలు చెబుతున్నారు.

పార్టీ నేతల ఫిర్యాదు
అయితే, సభ లో సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో ప్రధానంగా మీడియాతో పాటుగా.. హాజరైన జనంలోనూ ఇదే చర్చ జరిగిందనే నివేదికలు పార్టీకి అందినట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ వ్యాఖ్యల పైన వివరణ కోరే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. తొలి నుంచి సోము వీర్రాజు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే విమర్శ ఎదుర్కొన్నారు. తిరుపతి పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్లాస్ తో బీజేపీ నేతల తీరులో మార్పు వచ్చింది. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనటంతో పాటుగా.. విజయవాడలో భారీ సభ ఏర్పాటు చేసారు.

కేంద్ర నాయకత్వం ఆరా
కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరైన.. రాష్ట్రంలో బెయిల్ పై ఉన్న వారు జైలుకు వెళ్లక తప్పదంటూ పొలిటికల్ హీట్ పెంచే ప్రయత్నం చేసారు. కానీ, వీర్రాజు వ్యాఖ్యలతో వాటికి ప్రాధాన్యత లేకుండా పోయిందని పార్టీ నేతల భావన. ఇక, వీర్రాజు పైన వస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఎవరూ ఖండించటం లేదు...స్పందించటం లేదు. దీంతో...మొత్తంగా వీర్రాజు ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications