జగన్ తడబాటు..! విపక్షాలకు విమర్శనాస్త్రాలు స్వయంగా అందిస్తున్న ఏపి సీఎం..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు చర్యల వల్ల విపక్షాలు విపక్షాలు గళం పెంచుతున్నారు. విపక్షాలకు విమర్శల అస్త్రాలను స్వయంగా జగన్ మోహన్ రెడ్డే అందిస్తున్నారని, అందుకు అనుభవ రాహిత్యమే కారణమనే చర్చ జరుగుతోంది. జగన్ స్వయంకృతాపరాధం వల్లే ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారనే అపవాదుకూడా లేకపోలేదు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ప్రభుత్వ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రతిపక్షం ఆధారాలతో సభలోకి వస్తుంటే కనీస సమాచారంతో అదికార పార్టీ నేతలు రావడం లేదని, సామరస్యంగా చెప్పాల్సిన సమాధానం పట్ల కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సభలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, ఈవ్యవహారాన్ని ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి కూడా గ్రహించలేక పోతున్నారనే చర్చ జరుగుతోంది.

ఏపి సీఎం తొందరపాటు..! విమర్శలకు పదును పెంచుతున్న ప్రతిపక్షాలు..!!
పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలకు ఏపి ప్రజలు ఫిదా అయ్యారు. టీడిపి కన్నా మెరుగైన పాలన అందిస్తారని అధికారం కట్టబెడితే ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాడంటూ జగన్ పాలనపై విమర్శలు పదునెక్కుతున్నాయి. ప్రజాదర్బార్ కూల్చివేత నిర్ణయం సంగతి ఎలా ఉన్నా.. పరిపాలన విషయంలో వైఎస్ అడుగుజాడల్లో నడుస్తాడని భావించి సామాన్యులకు జగన్ మనసులో ఏముందనేది అర్దంగాకుండా ఉంది. ఆశా వర్కర్ల జీతాలు పెంచినా ఇంతవరకూ ఖాతాలో పడలేదు. పోలవరం, అమరావతి నిర్మాణాలు రెండు నెలలుగా అక్కడే నిలిచిపోయాయి. వెయ్యిరూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అంటూ ఊదరకొట్టిన జగన్ హామీ ఇప్పటికీ పట్టాలెక్కలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ నిలిచిపోయింది. ఇసుక కుంభకోణాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెరలేపినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

పాద యాత్రలో హామీలు..! నిలదీస్తున్న ప్రత్యర్థులు..!!
నలభై ఐదు ఏళ్లకే పింఛను అంటూ జగన్ ఇచ్చిన హామీపై టీడీపీ రచ్చ చేస్తోంది. ఒకప్పుడు టీడీపీ కేవలం కమ్మ వర్గానికే ప్రాదాన్యతనిచ్చిందంటూ జగన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. పోలీసు అధికారుల బదిలీలు, పదోన్నతులు కమ్మలకే అంటూ దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు జగన్ కూడా రెడ్డి వర్గానికి పెద్దపీట వేస్తూ.. టీటీడీ ఛైర్మన్ గిరి నుంచి చివరకు తన సలహాదారుగా అజయ్‌రెడ్డి కల్లం నియామకం వరకూ కేవలం తన వారికే పట్టం కట్టారనేది బహిరంగ రహస్యం.

చంద్రదబాబు కొంప ముంచిన విలాసాలు..! జగన్ కూడా అదే బాటలోనా..?
ఇకపోతే చంద్రబాబు ప్రయివేటు విమానాలు, హెలికాప్టర్లలో తిరిగాడంటూ దుమ్మెత్తిపోసిన అదే జగన్ ఇప్పుడు తాను కూడా ప్రయివేటు ఫ్లయిట్స్ మాత్రమే ఎక్కుతున్నారు. ఇవన్నీ మీడియా చూపకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరుతూనే ఉన్నాయి. చివరకు బీజేపీ నేతలు కూడా.. నెలరోజుల పాలన గురించి స్పందించారు. ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు అవినీతికి చక్రవర్తే అయినా.. కనీసం పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వచ్చాయి.

బాబు పై చేయి సాంధించాలనే ఒత్తిడి...! తడబడుతున్న జగన్..!!
అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించకపోయినా.. ఐఎంఎఫ్, ఏఐఐబీ వంటి సంస్థలు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పుడు అవే సంస్థలు మేము అమరావతికి అప్పులు ఇవ్వమంటూ ముఖానే చెప్పేస్తున్నాయి. ఇవన్నీ ఎంతగా దాచేందుకు ప్రయత్నించినా దాగని అంశాలు. జగన్ పదేళ్లపాటు జనంలో తిరిగాడు. పాదయాత్రతో జనం కష్టాలు దగ్గరగా చూశాడు. అదే నమ్మకం జనాన్ని ఎన్నికల బూత్ వరకూ రప్పించింది. ఫ్యాన్ గుర్తుకు ఓటేసేలా చేసింది. కానీ.. జగన్ దూకుడు స్వభావం. లోపించిన రాజనీతి వెరసి పాలనపై పట్టు లేకుండా వెనక్కిలాగుతున్నాయి. చంద్రబాబుపై గురిపెట్టడం వల్ల ప్రజారంజక పాలన గురించి ఆలోచించలేక పోతున్నారనే విమర్శలకు తావిచ్చారు. ఇది నిజంగా జగన్ తడబాటా.. గ్రహపాటా అనేది ఆత్మ విమర్శచేసుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.












Click it and Unblock the Notifications