రేపు ఏపీ అసెంబ్లీలో ఉద్యోగుల జీపీఎస్ బిల్లు-తాజా మార్పులకు కేబినెట్ ఆమోదం..!
ఏపీలో ఉద్యోగులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానం రద్దు చేస్తూ దాని స్ధానంలో జీపీఎస్ విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం .. దాన్ని చట్టబద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రేపు అసెంబ్లీలో ఉద్యోగుల జీపీఎస్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు ఇవాళ వెల్లడించింది. జీపీఎస్ బిల్లును ఇప్పటికే కేబినెట్ ఆమోదించినప్పటికీ తాజాగా కొన్ని మార్పులు చేశారు. దీంతో ఇది మరోసారి కేబినెట్ ఆమోదం కోసం వెళ్లింది.
ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసిన ప్రభుత్వం దాని స్ధానంలో మెరుగైన జీపీఎస్ విధానం తీసుకొస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా జీపీఎస్ బిల్లును తయారు చేసి గతంలో కేబినెట్ ఆమోదం కోసం పెట్టింది. కేబినెట్ లో ఆమోదించిన తర్వాత ఇందులో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో వాటిని సరిచేస్తూ మరోసారి కేబినెట్ ఆమోదానికి పంపింది. ఈ మేరకు మంత్రులకు ఈ-ఫైల్ ద్వారా ఈ బిల్లు ముసాయిదాను పంపారు. దీనికి కేబినెట్ ఆమోదం లాంఛనమే.

జీపీఎస్ ముసాయిదా బిల్లును కేబినెట్ లో మంత్రులు ఆమోదం తెలిపాక దీన్ని రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. జీపీఎస్ లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్ అప్ కొత్త ప్రతిపాదనలు ఈ బిల్లులో ప్రభుత్వం పెట్టింది. అలాగే యాన్యుటీ తగ్గితే ఫ్యామిలీ పెన్షన్, మినిమమ్ పెన్షన్ ఎలా ఇవ్వాలన్న దానిపై బిల్లులో మార్పులు చేర్పులు చేశారు. సీపీఎస్ ఉద్యోగులు జీపీఎస్ కు మారేందుకు కొంత సమయం ఇవ్వాలని కూడా ప్రతిపాదిస్తున్నారు. తద్వారా ఉద్యోగుల్లో జీపీఎస్ పై ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
మరోవైపు ఉద్యోగులు మాత్రం జీపీఎస్ బిల్లుపై అసంతృప్తిగానే కనిపిస్తున్నారు. తమకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని కోరుకుంటే ప్రభుత్వం మొండిగా జీపీఎస్ బిల్లు తెస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనిపై వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం సీపీఎస్ అయితే రద్దు చేశాం కాబట్టి ఉద్యోగులు అర్ధం చేసుకుంటారనే ఉద్దేశంతో ఉంది.












Click it and Unblock the Notifications