Kathi Mahesh: జగన్ సర్కార్ భారీ ఆర్థిక సహాయం: సీఎంఆర్‌ఎఫ్ నుంచి లక్షల్లో..!
అమరావతి: నెల్లూరు జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, దళిత నేత కత్తి మహేష్‌కు జగన్ సర్కార్ భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17 లక్షల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేపటి కిందటే విడుదలయ్యాయి. ఆయనకు చికిత్స అందిస్తోన్న చెన్నై అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి ఈ నిధులను బదలాయించేలా చర్యలు తీసుకుంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం హరికృష్ణ లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను మంజూరు చేశారు. దీన్ని చెన్నై థౌజండ్ లైట్స్ గ్రీమ్స్ లేన్‌లోని అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి పంపించారు. కత్తి మహేష్ చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని అధికారికంగా ఈ లెటర్ ద్వారా తెలియజేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జయిన తరువాత కూడా కనీసం 90 రోజుల పాటు కత్తి మహేష్.. తన ఇంటి వద్దే చికిత్సను తీసుకోవాల్సి ఉంటుందంటూ డాక్టర్లు చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుని.. దానికి అయ్యే ఖర్చు 17 లక్షల రూపాయలను విడుదల చేస్తామని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆయన తలకు తీవ్ర గాయమైంది. తొలుత నెల్లూరులోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన పొరుగునే ఉన్న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతోన్నారు. తలకు తీవ్రగాయం కావడం వల్ల కంటి చూపు సైతం కోల్పోయే ప్రమాదం ఉందంటూ మొదట్లో వార్తలొచ్చాయి. డాక్టర్లు శ్రమించి ఆయనకు నిర్వహించిన శస్త్ర చికిత్సలను విజయవంతం చేశారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. ఇంకొన్ని పరీక్షలను నిర్వహించాల్సి ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications