మొత్తం మంత్రులు ఔట్- జగన్ సంచలన నిర్ణయం..!! మోదీ మార్క్ మించి-కొత్తగా ఛాన్స్ ఎవరికంటే..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. రెండున్నారేళ్ల తరువాత తన కేబినెట్ లో మార్పుల ఉంటాయని..తొలి కేబినెట్ కూర్పు సమయంలోనే జగన్ ప్రకటించారు. దాదాపు 90 శాతం మంది మరుతారని స్ఫష్టం చేసారు. ఇప్పటికే 26 నెలల పాలన పూర్తయింది. మరి కొద్ది నెలల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అందునా..ఇప్పుడున్న కేబినెట్ లో ఉండేదెవరు..కొత్తగా అవకాశం దక్కేదెవరు అనేక లెక్కలు వేస్తున్నారు. అయితే, జగన్ మాత్రం తన మార్క్ నిర్ణయాలకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

కేబినెట్ లో అవకాశం దక్కక పోవటంతో..
2019 లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యత లు చేపట్టిన తరువాత ఊహించని విధంగా సామాజిక సమీకరణాలు- అయిదుగురు ఉప ముఖ్యమంత్రులతో కేబినెట్ రూప కల్పన చేసారు. రెండున్నారేళ్లు కావస్తోంది. అందులో దాదాపుగా ఏడాది కాలం పైగా కరోనాతోనే సరి పోయింది. ఇదే సమయంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసారు. ఎమ్మెల్యేలకు జోడు పదవులు లేవని తేల్చి చెప్పారు. జోడు పదవుల్లో ఉన్న ఎమ్మెల్యేలను నామినేటెడ్ పదవులను నుంచి తీసేసారు. ఇక, పార్టీ ఆవిర్బావం నుంచి పని చేస్తూ..తమకు గుర్తింపు రాలేదని- సీనియర్లు కొంత మందికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం చాలా మంది పార్టీ సీనియర్లలో నెలకొంది.

టార్గెట్ - 2024 కు సిద్దంలో భాగంగా..
ఇక, 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని జగన్ డిసైడ్ అవుతున్నారు. ప్రభుత్వంతో పాటుగా పార్టీ పదవులు కీలకం కావటంతో..అందుకోసం కొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం తాజాగా కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలో ప్రధాని మోదీ అనుసరించిన ఫార్మలాను సీఎం జగన్ సైతం ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోంది. సీనియర్లను పార్టీ సేవల కోసం పక్కన పెట్టి.. కేబినెట్ విస్తరణ చేసారు. అయితే, అంతుకు మించి అన్నట్లగా నిర్ణయం తీసుకోవటానికి రంగం సిద్దమైంది.

ప్రస్తుత మంత్రులంతా ఔట్.. కొత్త ఆలోచనతో..
అందులో భాగంగా..ప్రస్తుతం ఉన్న కేబినెట్ మొత్తాన్ని తప్పించి..వారి స్థానంలో 2024 టీంను ఏర్పాటు చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లగా విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న సీనియర్లను చివరి రెండేళ్లు పూర్తిగా పార్టీ బాధ్యతలు-ప్రజలకు పార్టీని ..ప్రభుత్వాన్ని దగ్గర చేయటమే లక్ష్యంగా బాధ్యతలు అప్పగించనున్నారు. గతంలో పాలనలో అనుభవం ఉండి.. వైసీపీ కోసం తొలి నుంచి పని చేసిన వారిని గుర్తించి మంత్రి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.

పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు..
దీని ద్వారా తమకు గుర్తింపు లేదనే భావన పార్టీ కోసం సిన్సియర్ గా పని చేసిన సీనియర్లలో పోగొట్టి వారిని 2024 ఎన్నికలకు సిద్దం చేయాలనేది జగన్ ఆలోచన. అదే విధంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం - పార్టీ శ్రేణుల మధ్య కొంత గ్యాప్ కనిపిస్తోంది. దీనిని భర్తీ చేయటం కోసం సీనియర్ల సేవలను వినియోగించుకోనున్నారు. ఇందు కోసం ఇప్పటికే ప్రాంతీయ సమన్వయకర్తలు ఉండగా..ఇక, సీనియర్ మంత్రులుగా ప్రస్తుతం పని చేస్తున్న వారిని పార్టీ- ప్రభుత్వం మధ్య వారధిగా కో-ఆర్డినేటర్లుగా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.

సీనియర్ నేతలకు పార్టీ బాధ్యతలు..
పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంటూ..ప్రతిపక్షాలను అడ్డుకుంటే తిరిగి అధికారంలోకి వస్తామని..అప్పుడే తిరిగి ప్రభుత్వ పదవులు అందరికీ దక్కుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. 2024 ఎన్నికలు ఇటు సీఎం జగన్ - అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి అధికారంలోకి వచ్చి తన పార్టీని కాపాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదే సమయంలో అధికారం జారి పోకుండా..తిరిగి నిలబెట్టుకుంటే ఇక, ఏపీలో ఇప్పట్లో టీడీపీ కోలుకొనే అవకాశం ఉండదని...తనకు రానున్న రోజుల్లో రాజకీయంగా ఎదురే ఉండదనేది జగన్ భావన. ఇదే సమయంలో కేంద్రంలో జమిలి ఎన్నికల ప్రస్తావన కూడా చర్చకు వస్తోంది.

అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా..
ఈ పరిస్థితుల్లో సీనియర్లను పార్టీని బలోపేతం...ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చేసే బాధ్యతలు అప్పగించనున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే వారికి తిరిగి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించే విధంగా వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక, బలమైన వాయిస్ ఉన్న వారికి జగన్-2024 టీంలో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, కొందరు సీనియర్లను పక్కన పెట్టి.. కొందరిని కొనసాగించటం.. ఇప్పుడున్న మంత్రుల్లో పని తీరు పేరుతో తీసేయటం వంటివి చేయటం కంటే..అందరినీ ఒకే సారి పక్కన పెట్టి.. కొత్త వారికి అవకాశం ఇవ్వటం ద్వారా ఎక్కడా కొత్త సమస్యలు రావనేది జగన్ ఆలోచన.

అందరినీ తొలిగిస్తే..సమస్యలు లేకుండా..
దీనికి తగినట్లుగానే మొత్తం తన కేబినెట్ లోని వారందరినీ తొలిగించి...కొత్త జోష్ తో జగన్ తన డ్రీం కేబినెట్ ఏర్పాటుకు సిద్దం అవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దీంతో..గతంలో మంత్రి పదవి దక్కని సీనియర్లు సైతం ఇప్పుడు తిరిగి కేబినెట్ బెర్తు కోసం పోటీకి సిద్దమవుతున్నారు. కానీ, వ్యక్తులు మారినా..సామాజిక సమీకరణాల విషయంలో మాత్రం జగన్ ఇప్పుడున్న ఫార్ములానే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అయితే, డిసెంబర్ లోగానే కేబినెట్ విస్తరణ ఉండవచ్చని విశ్వసనీయ సమాచారం. మరోవైపుదసరా సమయంలోనే అవసరమైన విధంగా పాలనలో మార్పులు - చేర్పులు చేసుకొని ముందుకు సాగాలనే ఆలోచన సైతం వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రచ్చబండ సైతం డిసైడ్ కావటంతో..ఏపీలో రానున్న రోజుల్లో రాజకీయంగా వాతావరణం రంజుగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications