చంద్రబాబుకు జగన్ ఫోన్ : నేడు కేసీఆర్..రేపు మోదీతో భేటీ: ప‌్రమాణ స్వీకారాహ్వానం..సహకారం..!
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ కార్యాచరణ వేగవంతం చేసారు. ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ద్వారా తన లక్ష్యాలను..ఉద్దేశాలను స్పష్టం చేయనున్నారు. ఇందు కోసం తాను అందరితోనూ మంచి సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నారు. ఇందు కోసం తెలంగాణ ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఈ రోజు గవర్నర్‌తో రేపు ప్రధానితోనూ జగన్ సమావేశం కానున్నారు. ఏపీకీ వారిద్దరి సహకారం కోరనున్నారు.
నేడు గవర్నర్..కేసీఆర్..రేపు మోదీతో...
ఈ రోజు వైసీపీ శాసనసభా పక్ష నేతగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆ తరువాత పార్టీలోని కొందరు ముఖ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లి గవర్నర్‌తో సమావేశం కానున్నారు. శాసనసభా పక్షం తనను నేతగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానం అందించి..ప్రమాణ స్వీకారం గురించి అనుమతి తీసుకుంటారు. ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..కేటీఆర్‌తో సమావేశం అవుతున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ జగన్ వారిద్దరినీ ఆహ్వానించనున్నారు. అదే విధంగా ఎన్నికల సమయంలో బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు ఇరు ప్రాంతాల ప్రయోజనాల కోసం కలిపి పని చేద్దామని..ఏపీకి ప్రత్యేక హోదా- పోలవరం అంశాల్లో సహకరించాలని జగన్ మరో సారి కేసీఆర్‌ను కోరనున్నారు. రెండు పార్టీల ఎంపీలు కలిసి పని చేసి రెండు ప్రాంతాలక కేంద్రం నుండి రావాల్సినవి సాధించుకోవాలనేది జగన్ - కేసీఆర్ లక్ష్యం. దీని పైనా ఇద్దరు మరోసారి చర్చించనున్నారు.

చంద్రబాబుకు జగన్ ఫోన్..
ఇక, ఆదివారం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీని కలవనున్నారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావటంతో ఏ పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దీంతో..ఇప్పుడు జగన్ ప్రమాణ స్వీకారానికి ముందే ప్రధానితో సమావేశమై ఏపీ లో ప్రస్తుతన పరిస్థితిని వివరించనున్నారు. ఆర్దికంగా తోడ్పాటుతో పాటుగా ఏపీకీ ప్రత్యేక హోదా పైన సానుకూల నిర్ణయం తీసుకోవాలని..తమ ప్రభుత్వానికి సహకరించాలని కోరనున్నారు. జగన్ పైన మోదీ సైతం సానుకూలంగా ఉండటంతో..మోదీ ఇప్పుడు కూడా అనుకూలంగానే స్పందిస్తారని జగన్ అంచనా. ఇక, తన ప్రమాణ స్వీకారానికి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఈ మేరకు తానే చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించటంతో పాటుగా పార్టీ ప్రతినిధులతో ఆహ్వానం పంపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల వరకే రాజకీయాలని..పాలనా పరంగా అందరినీ కలుపుకు పోవటం ద్వారా మంచి ఫలితాలు..ఇమేజ్ వస్తాయని భావిస్తున్న జగన్..తన ప్రమాణ స్వీకారం ద్వారానే తాను పరిణితి చెందిన రాజకీయ వేత్తను అని నిరూపించుకోవాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications