ఏబీ విదేశీ పర్యటనకు జగన్ సర్కార్ బ్రేక్ ? హైకోర్టులో పిటిషన్..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసి ఆ తర్వాత జగన్ సర్కార్ ఆగ్రహానికి గురైన ఏబీ వెంకటేశ్వరరావుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి ఆయన చేసుకున్న ఓ విజ్ఞప్తిని సీఎస్ తిరస్కరించారు. దీంతో ఆయన చేసేది లేక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆయన పిటిషన్ పై విచారణ జరిపేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అసలేం జరిగిందో ఓసారి చూద్దాం..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాలను అక్రమంగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై వైసీపీ సర్కార్ సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఆ తర్వాత న్యాయస్ధానాల్ని ఆశ్రయించి జాయినింగ్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే సస్పెన్షన్లో ఉన్న కాలానికి తనకు రావాల్సిన జీతభత్యాలు, ఇతర ప్రయోజనాల్ని కోరుతూ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.

ఆ తర్వాత ఇప్పుడు తనను విదేశీ టూర్ కు అనుమతించాలంటూ సీఎస్ కు మరో విజ్ఞప్తి చేశారు. దీన్ని కూడా సీఎస్ తిరస్కరించారు. ఈ నేపధ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తనను విదేశీ టూర్ కు అనుమతించేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ఏబీ పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపి నిర్ణయం ప్రకటిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
గతంలో జీత భత్యాల చెల్లింపు విషయంలో అప్పటి సీఎస్ సమీర్ శర్మపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన ఏబీకి ఇప్పటివరకూ ఊరట దక్కలేదు. అదే సమయంలో ఇప్పుడు విదేశీ టూర్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. హైకోర్టు అనుమతి ఇవ్వకపోతే మాత్రం ఆయన విదేశాలకు వెళ్లడం సాధ్యం కాదు.












Click it and Unblock the Notifications