ఏపీలో ముగ్గురు కీలక ఐఏఎస్ లకు జగన్ సర్కార్ ప్రమోషన్-స్పెషల్ ఛీఫ్ సెక్రటరీలుగా...
ఏపీలో ఎన్నికల ఏడాది ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారుల్ని తాజాగా బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వంలోనూ, మరొకరు గవర్నర్ వద్ద కీలక స్ధానాల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులే కావడం విశేషం. ఈ ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అనిల్ కుమార్ సింఘాల్, ఎంటీ కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేదీలకు ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురు ఐఏఎస్ లను ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. వీరికి ఫిక్సెడ్ పే స్కేల్ రూ.2.25 లక్షలుగా నిర్ణయించారు. అలాగే వీరు ప్రస్తుతం ఉన్న పదవుల్లోనే కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇవాళ ప్రమోషన్ పొందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులూ వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక స్ధానాలు పొందారు. ఒకరు సచివాలయ వ్యవస్ధ రూపకల్పనలో కీలకంగా ఉంటే మరొకరు వైద్యారోగ్య, రవాణా శాఖల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరొకరు అంతకు ముందు టీటీడీలో కీలక స్ధానంలో ఉంటూ గవర్నర్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ముగ్గురికి వారి సీనియార్టీల ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ప్రమోషన్ ఇచ్చిన వారిలో అనిల్ కుమార్ సింఘాల్ గవర్నర్ కార్యదర్శి హోదాలోనే కొనసాగబోతున్నారు. అలాగే ఎంటీ కృష్ణబాబు..ప్రస్తుతం నిర్వహిస్తున్న వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగానే కొనసాగుతారు. మరో ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేదీ కూడా వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శితో పాటు ఆర్బీకేల కమిషనర్ గానూ కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.












Click it and Unblock the Notifications