చంద్రబాబుకు పోలీసుల నోటీసులు-రేపు కుప్పం టూర్ తో ఆంక్షలు మొదలు-హద్దు మీరితే.. !
ఏపీలో కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రేపు తలపెట్టిన కుప్పం టూర్ పై ఆంక్షల కొరడా మొదలైంది. పలమనేరు సబ్ డివిజన్ పరిధిలోని మూడు మండలాల్లో రేపటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు టూర్ కు అనుమతి కోరారు. దీంతో పోలీసులు ఆంక్షల్ని గుర్తుచేస్తూ నోటీసులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా ర్యాలీలు, రోడ్ షోలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు జారీ చేసిన ఈ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చంద్రబాబు కుప్పం టూర్
టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి మూడు రోజుల పాటు పలమనేరు సబ్ డివిజన్ పరిధిలోని శాంతిపురం, గుడుపల్లి, కుప్పం మండలాల్లో పర్యటించబోతున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోకి వచ్చే ఈ మూడు మండలాల్లో తాను పర్యటిస్తున్నట్లు పోలీసులకు చంద్రబాబు సమాచారం ఇచ్చారు. దీంతో వారు దీనికి స్పందనగా మరిన్ని వివరాలు కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షల్ని గుర్తుచేస్తూ నోటీసులు జారీ చేశారు. పలమనేరు సబ్ డివిజనల్ పోలీసు అధికారి పేరుతో చంద్రబాబు పీఏ మనోహర్ కు ఈ నోటీసులు పంపారు.

సెక్షన్ 30 అమల్లో ఉందన్న పోలీసులు
గత నవంబర్ లో పలమనేరు సబ్ డివిజన్లో ఉద్రిక్తతల దృష్ట్యా సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు చంద్రబాబుకు పంపిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. జనవరి 1 నుంచి 30 వరకూ మళ్లీ సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు పలమనేరు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో తాజాగా కందుకూరు, గుంటూరులో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో పలమనేరులో పోలీసు చట్టంలోని సెక్షన్ 30 కింద ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు ఈ నోటీసులో పేర్కొన్నారు. దీంతో పాటు మరిన్ని అంశాల్ని ఈ నోటీసులో ప్రస్తావించారు.

కచ్చితమైన వివరాలు కోరిన పోలీసులు
పలమనేరు సబ్ డివిజన్ లో సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో.. సభలు, సమావేశాలు పెట్టాలంటే ముందుగా సమావేశమయ్యే ప్రదేశాలు పేర్కొంటూ ముందస్తు అనుమతి తీసుకున్నాక పెట్టుకోవాలని పోలీసులు చంద్రబాబును కోరారు. ఇరుకు రోడ్లలో, జాతీయ, రాష్ట్ర రహదారులపై కాకుండా ఏదైనా విశాల ప్రదేశంలో పెట్టుకోవాలని వారు సూచించారు. వివరాలు ఇస్తే పరిశీలించి అనుమతిస్తామని పోలీసులు చంద్రబాబుకు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్ని అధికారులు ఈ నోటీసుల్లో యథాతథంగా ప్రస్తావించారు.

ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలే..
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్ని రేపటి కుప్పం టూర్ లో చంద్రబాబు పాటించాల్సి ఉంటుందని పలమనేరు పోలీసులు పేర్కొన్నారు. అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా, జీవోలో నిబంధనలు అతిక్రమించి సభలు, సమావేశాలు జరిపి, వాటి వల్ల ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. దీంతో రేపటి కుప్పం టూర్ పై ఉత్కంఠ నెలకొంది. పోలీసులు జారీ చేసిన నోటీసుపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications