ఉద్యోగుల పోరుపై రూటుమార్చిన జగన్ సర్కార్ ? నేతల హెచ్చరికలపై మౌనం ! తాజా వ్యూహమిదే !
ఏపీలో ఉద్యోగుల సమస్యలపై గతంలో వరుస సమావేశాలు నిర్వహించిన జగన్ సర్కార్ ఈసారి వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది.
ఏపీలో ఉద్యోగ సంఘాలు వైసీపీ సర్కార్ తీరుపై ఒక్కొక్కటిగా స్వరం పెంచుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ఆర్ధిక ప్రయోజనాలు నెరవేర్చాల్సిందేనని పట్టు బడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారితో గతంలోలా చర్చలతో సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు. తాజాగా చర్చలు జరిగినా కొత్త హామీలేవీ ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం.

ఏపీలో ఉద్యోగుల పోరు
ఏపీలో ఈ నెల 9 నుంచి ఉద్యోగులు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్ గతంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన సీపీఎస్ రద్దు, మెరుగైన పీఆర్సీ వంటి హామీలతో పాటు ఈ నాలుగేళ్లుగా పెండింగ్ లో పెడుతున్న ఆర్దిక ప్రయోజనాల్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. వీటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు లభించకపోవడంతో పోరుకు తెరదీస్తున్నారు. ఈ నెల 9 నుంచి దశల వారీగా ఆందోళనలు చేపట్టేందుకు ఇప్పటికే ఏపీ జేఏసీ కార్యాచరణ ప్రకటించగా.. వారికి మద్దతుగా మిగతా ఉద్యోగ సంఘాలు కూడా కదులుతున్నాయి.

ఉద్యోగ నేతలపై పెరిగిపోతున్న ఒత్తిడి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన పీఆర్సీ పేలవంగా ఉండటం, సీపీఎస్ రద్దు, కాంటాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి హామీలు నెరవేర్చకపోవడం, జీతభత్యాలు సకాలంలో చెల్లించకపోవడంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో ఉద్యోగ నేతలు ప్రభుత్వంతో పదే పదే చర్చలకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగులు వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వంలో కుమ్మక్కై తమ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారంటూ ఉద్యోగ సంఘాల సమావేశాల్లో వారిని నిలదీస్తున్నారు. దీంతో ఉద్యోగ నేతలపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది.

లైట్ తీసుకుంటున్న సర్కార్
గతంలో ఉద్యోగ సంఘాలు పోరు ప్రకటించగానే పీఆర్సీతో పాటు పలు డిమాండ్లపై వరుసగా చర్చలు నిర్వహించి హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చే విషయంలో మాత్రం ఆ దూకుడు ప్రదర్శించలేకపోయింది. దీంతో ఈసారి ఉద్యోగులకు ఏం చెప్పాలో తెలియని పరిస్ధితి. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి బొత్స, సలహాదారు సజ్జల చర్చలు జరిపినా ఫలితం లేదు. కొత్తగా ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఉద్యోగ నేతలు పోరుకు మొగ్గు చూపుతున్నారు. అయినా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్చలకు మొగ్గు చూపడం లేదు. దీంతో ఈసారి ఉద్యోగుల పోరును ప్రభుత్వం లైట్ తీసుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది.

జగన్ సర్కార్ వ్యూహమిదే ?
ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమంటూ గతంలో వరుస ప్రకటనలు చేసిన ప్రభుత్వ పెద్దలు.. ఈసారి మాత్రం అంత ధీమాగా ఆ విషయం చెప్పడం లేదు. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి హామీలు నెరవేర్చే పరిస్దితీ లేదు. దీంతో ఉద్యోగులతో చర్చించినా ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నిలబెట్టిన అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నట్లు వస్తున్న వార్తలు కూడా ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులు వైసీపీకి అనుకూలంగా ఉంటారనే ఆశలు ఆవిరయ్యాయి. కాబట్టి ఉద్యోగులు పోరు మెదలుపెట్టాక పరిస్ధితిని బట్టి స్పందించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications