సచివాలయ ఉద్యోగులపై జగన్ సర్కార్ సీరియస్ ? ఇకపై కొత్త రూల్ ! సీఎస్ తనిఖీలు !
ఏపీలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఓ కీలక అంశంలో ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని విషయంలో ఇన్నాళ్లు మౌఖిక ఆదేశాలు ఇస్తూ వచ్చిన ఉన్నతాధికారులు... ఉద్యోగులు పట్టించుకోకపోవడంతో దీనిపై తాజాగా కీలక నోట్ జారీ చేసింది. ఇందులో పేర్కొన్న అంశాలపై ఇప్పుడు ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ చర్చ జరుగుతోంది.

అమరావతిలోని వెలగపూడిలో ఉన్న రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల హాజరు విషయంలో ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. కింది స్ధాయి సిబ్బంది మొదలుకుని ఐఏఎస్ ల వరకూ ఆఫీసులో అందుబాటులో ఉండే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకూ పలుమార్లు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా ఉద్యోగులు సమయ పాలన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు తేలడంతో ఈసారి సాధారణ పరిపాలన శాఖ ద్వారా కీలక నోట్ పంపారు.

ఎన్నిసార్లు చెప్పినా అధికారులు,ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని గుర్తించిన ప్రభుత్వం సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) ద్వారా అన్ని శాఖలకూ కీలక నోట్ పంపింది. ఇందులో ఇకపై ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకల్లా అటెండెన్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ వివరాల్ని సంబంధిత కార్యదర్శులకు వెంటనే పంపాలన్నారు. అలాగే సచివాలయంలోని అన్ని విభాగాల్లో ఇకపై సీఎస్ ఆకస్మిక తనిఖీలు చేస్తారని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాబట్టి అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా నిబంధనలకు అనుగుణంగా హాజరుతో పాటు సమయపాలన పాటించాలని ఆదేశించారు.
