గణేశ్ మండపాలపై ఆంక్షల్లేవన్న జగన్ సర్కార్-ఆగని విపక్షాల రచ్చ-బీజేపీపై వైసీపీ ఫైర్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గణేశ్ మండపాలపై ఆంక్షలు పెడుతోందంటూ బీజేపీ, టీడీపీ చేస్తున్న ప్రచారం శృతి మించుతోంది. ప్రభుత్వం, పోలీసులు దీనిపై ఎన్నిసార్లు వివరణలు ఇస్తున్నా ఈ రెండు పార్టీలు మాత్రం తమ పోరు ఆపడం లేదు. దీంతో ఇవాళ మరోసారి ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
గణేశ్ మండపాలకు ఫైర్,విద్యుత్,పోలీస్ పర్మిషన్స్ తీసుకోవాలని ప్రభుత్వంచెబుతోందని, ఇవి నిబంధనలు కావా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అవుతున్నారు. హైదరాబాదులో వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారని, ఆ వేడుకలు చూసేందుకు ఎక్కడెక్కడ నుండో ప్రజలు తరలి వస్తారన్నారు. సీఎం అక్కడికి వెళ్లి అందులో పాల్గొంటే అప్పుడు ఆ ప్రాముఖ్యత తెలుస్తుందన్నారు. ఇక్కడ పెట్టిన నిబంధనలు అన్నీ వెంటనే తొలగించాలన్నారు. నిబంధనలు లేవు అంటూనే ఎన్నో నిబంధనలు పెట్టారని విమర్శించారు. నిబంధనల పేరుతో పండుగని అడ్డుకోవాలంటే బిజెపి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ నిబంధనలు ఏమీ పట్టించుకోవద్దని సోము సూచించారు. రాజమండ్రిలో వినాయక చవితి వేడుకల్లో తాను పాల్గొంటానన్నారు.
దానికి ఎలాంటి అనుమతులు తీసుకోనన్నారు. దమ్ముంటే నన్ను అడ్డుకోండి, అరెస్ట్ చెయ్యండని సవాల్ విసిరారు.

దీంతో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇవాళ సోము వీర్రాజుపై ఫైర్ అయ్యారు. వినాయక చవితి వేడుకలపై తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వినాయక చవితి వేడుకలపై రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. పదే పదే రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. రాజకీయాల కోసం టీడీపీ, బీజేపీ పండుగలను వాడుకోవడం దుర్మార్గమని కొట్టు విమర్శించారు. దేవుడితో ఆటలాడటమంటే నిప్పుతో చెలగాటమేనన్నారు. కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదన్నారు. వినాయక చవితి వేడుకల కోసం ఎలాంటి రుసుములు వసూలు చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మరోసారి ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications