అడ్డంగా దొరికిన వైసీపీ ఎంపీ- కిమ్మనని జగన్- ఇప్పటికే ఆస్తుల కేసులో సహనిందితుడు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. ఈ రెండేళ్లలో ఒక్క ఎంపీపైనా, ఎమ్మెల్యేపైనా అవినీతి ఆరోపణలు రాలేదు. తాజాగా పార్టీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డిపై మాత్రం ఏకంగా రూ.300 కోట్లు పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. తాజా ఐటీ దాడుల్లో ఇది బయటపడటంతో ఈ మొత్తం చెల్లించేందుకు ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఛైర్మన్ గా ఉన్న రాంకీ గ్రూప్ అంగీకరించింది. అంటే తప్పును ఒప్పుకుంది. అయితే ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు సీఎం జగన్ సహా వైసీపీలో ఎవరూ ఇష్టపడటం లేదు.

బ్లాక్ మనీ కేసులో అయోధ్య రామిరెడ్డి
ఈ నెల 6న హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన సోదాల్లో వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ రూ.300 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు నిర్ధారణ అయింది. ఐటీ సోదాల్లో దాదాపు రూ.1200 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఐటీ అధికారులు నిన్న ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో రూ.288 కోట్ల మొండి బకాయిలు ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపినట్లు కూడా నిర్ధారించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని కూడా ఐటీ శాఖ ప్రకటించింది. దీంతో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి కష్టాలు తప్పేలా లేవు.

జగన్ ఆస్తుల కేసులోనూ నిందితుడు
జగన్ అక్రమాస్తుల కేసులోనూ ఎంపీ అయోధ్య రామిరెడ్డి నిందితుడుగా ఉన్నారు. ఆయన ఛైర్మన్ గా ఉన్న రాంకీ గ్రూప్ పెట్టుబడుల విషయంలో సీబీఐ నమోదు చేసిన కేసులపై ఇంకా విచారణ జరుగుతోంది. తాజాగా అయోధ్య రామిరెడ్డి కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.
దీనికి తోడు తాజాగా ఐటీ శాఖ కూడా రాంకీ గ్రూప్ పై దర్యాప్తు జరుపుతుండటం ఆయనతో పాటు వైసీపీకీ ఇబ్బందికరంగా మారుతోంది. స్టాక్ మార్కెట్ లావాదేవీల విషయంలో షేర్ల ధరల్ని అక్రమంగా పెంచారన్న ఆరోపణలు రుజువైతే ఆయనకు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.

బ్లాక్ మనీ కేసుపై కిమ్మనని జగన్
తమ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఏకంగా రూ.300 కోట్ల నల్లధనం కేసులో చిక్కుకున్న నేపథ్యంలో వైసీపీ నుంచి కానీ, అధినేత జగన్ నుంచి కానీ ఎలాంటి స్పందనా లేదు. అయోధ్య రామిరెడ్డి జగన్ కు సన్నిహితుడు కావడం, పార్టీకి ఆర్ధికంగా దన్నుగా ఉండటంతో అయోధ్య రామిరెడ్డి విషయంలో వైసీపీ అధినేత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతే కాదు పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా ఈ వ్యపహారంపై నోరు మెదిపేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఓ ఎంపీపై ఆర్ధిక నేరాల ఆరోపణలు వచ్చినా పార్టీ మాత్రం ఆయనకే మద్దతుగా నిలుస్తున్నట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications