జైరాం కాళ్లు పట్టుకున్న నానాజి, వివాదంలో శత్రుచర్ల
తూర్పుగోదావరి/శ్రీకాకుళం: తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి జైరాం రమేష్‌కు వింత అనుభవం ఎదురైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు.
జిల్లాలో పర్యటిస్తున్న జైరాం రమేష్ కాళ్లు పట్టుకున్న రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ నానాజీ, కాకినాడను ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించాలని వేడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారిని తోసుకుంటూ వచ్చిన నానాజీ జైరాం రమేష్ కాళ్లు పట్టుకున్నారు. సీమాంధ్ర రాజధానిగా కాకినాడను ప్రకటించాలని జైరాం రమేష్‌కు విన్నవించారు.

గిరిజన యువకుడితో చెప్పులు తొడిగించుకున్న శత్రుచర్ల
శ్రీకాకుళం: జిల్లాలోని పాతపట్నంలో పర్యటించిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలోని ఓ ఆలయంలో ఆయన మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి బయటికి వచ్చిన శత్రుచర్లకు లక్షణరావు అనే గిరిజన యువకుడు చెప్పులు తొడిగాడు. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శత్రు చర్లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా, పాతపట్నానికి వచ్చిన శత్రుచర్ల విజయరామరాజును గ్రామానికి చెందిన పలువురు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని శత్రుచర్ల అనుచరులు నియంత్రించారు. ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా శత్రుచర్ల మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనే ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) పునర్నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. త్వరలో తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు శత్రుచర్ల తెలిపారు.












Click it and Unblock the Notifications