పాలన ఉద్యమించినంత ఈజీయా: జైరాం, భయం: జానా
మెదక్/హైదరాబాద్: రాష్ట్రాన్ని పాలించడం ఉద్యమాలు చేసినంత వీజీ కాదని కేంద్రమంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్ ఆదివారం అన్నారు. ఆయన మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కోర్టులకు వెళ్తే ఎలాంటి నష్టం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు లేకున్నా తమ పార్టీ బలంగా ఉందన్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. పాలించడం అంటే ఉద్యమాలు చేసినంత వీజీ కాదని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం తాము విభజన చేయలేదని, సామాజిక న్యాయం కోసమే చేశామన్నారు.

మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి అంశంపై స్పందిస్తూ... ఆమెపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. పురంధేశ్వరి ఎనిమిదేళ్లలు పదవులు అనుభవించి ఇప్పుడు వేరే పార్టీలో చేరడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పార్టీని కాదని కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం విచారకరమన్నారు.
భయంగా ఉంది: జానా రెడ్డి
తెలంగాణ ప్రజలు కోరిన పరిపాలన తాము అందిస్తామో లేదో అన్న భయం తమలో ఉందని మాజీ మంత్రి జానా రెడ్డి అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధించింది అధికారం కోసం కాదని, ప్రజల ఆశయాలు తీర్చేందుకే అన్నారు. సామాజిక న్యాయంతో కూడిన పాలన అవసరమని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications