వైఎస్ తెచ్చింది కాదు, ఎందుకు పిలిచారు: జానా చురక
హైదరాబాద్: అటవీ హక్కుల చట్టం తెచ్చింది వైయస్ రాజశేఖర రెడ్డి కాదని, ఆ చట్టాన్ని తెచ్చింది కేంద్ర ప్రభుత్వమని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి గురువారం అన్నారు. శాసనసభలో ఆ చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆశ్వారావుపేట ఎమ్మెల్యే టి వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి వివరణ ఇచ్చారు.
అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం వెంకటేశ్వర్లు వ్యాఖ్యలపై మండిపడటం సరికాదని, పార్టీల విధానాన్ని పక్కన పెట్టి ప్రాంతం విధానాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని పోలవరం ముంపుప్రాంతాల ఆర్డినెన్సును ఉపసంహరించుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుదామని జానారెడ్డి అన్నారు.

ఈ వ్యాఖ్యలకు ముందు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ తాము ముంపు ప్రాంతాలు అన్నీ తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నామని చెప్పగా, దానిపై కెసిఆర్ మాట్లాడుతూ మీరు వేసుకున్న కండువా పార్టీ అధినేతకు ముందు చెప్పాలని, ఆయన విధానం ఏమిటో తెలుసుకోండి, ఆ విధానం వ్యతిరేకంగా ఉండే మీ విధానం ఏమిటో తేల్చుకోండి అంటూ వ్యాఖ్యానించారు. టిడిపి నేతలు కూడా అలాగే చేయాలని సూచించిన విషయం తెలిసిందే.
అసెంబ్లీలో జానా రెడ్డి, మంత్రి హరీష్ రావుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. అధికారులు లేకపోయినందునే రుణమాఫీ తదితర అంశాలపై పూర్తిగా నివేదికలు తయారు చేయలేకపోయామని అధికార పక్షం నేతలు చెప్పారు. అంతేకాదు రెడ్యా నాయక్ ప్రసంగానికి అధికార పక్షం సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. దీంతో జానా స్పందిస్తూ.. అధికారులు లేకపోతే అసెంబ్లీక ఎందుకు పిలిచినట్లు అని చురకలు వేశారు.
గిరిజనులకు అన్యాయం జరగలేదు: హరీష్
గిరిజనులు అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు తమ పార్టీ నుండి కూడా ఎంపికయ్యారని తాము ఎవరికీ అన్యాయం చేయడం లేదని, గిరిజన సంక్షేమ శాఖను ముఖ్యమంత్రి స్వయంగా చూడటం వల్ల వారికి మరింత మేలు జరుగుతుందని మంత్రి హరీష్ రావుఅన్నారు. ఈ విషయంలో ఎవరికీ బెంగ, అనుమానం అక్కర్లేదన్నారు. తాము ఇచ్చిన ప్రతి మాటను అమలుచేసి తీరుతామన్నారు.












Click it and Unblock the Notifications