కడపకు వైఎస్సార్ పేరు: కర్నూలు జిల్లాకు ఆ మాజీ సీఎం పేరు పెట్టకూడదా: పవన్ కల్యాణ్
కర్నూలు: కర్నూలు జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అలా డిమాండ్ చేసే హక్కు తమకు ఉందని అన్నారు. ఆ హక్కుతోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని చెప్పారు. కర్నూలు జిల్లా పేరును దామోదరం సంజీవయ్యగా మార్చాలని అన్నారు. ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తామే కర్నూలు జిల్లాకు 'దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా'గా పేరు మారుస్తామని స్పష్టం చేశారు.

మహనీయుల స్ఫూర్తితోనే..
ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లా అని మార్చినప్పుడు... అణగారిన వర్గాలకు అండగా నిలిచిన దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఆయన పేరు పెట్టడం సమంజసమే అని పవన్ కల్యాణ్ అన్నారు. ఎందరో మహానుభావుల స్ఫూర్తితో జనసేన పార్టీ ఆవిర్భవించిందని, వారి స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు.

బూర్గుల, పీవీ, దామోదరం సంజీవయ్య..
తెలుగువారు కలిసి ఉండాలని ఉద్దేశంతో బూర్గుల రామకృష్ణా రావు తన పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని చెప్పారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు గొప్ప ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. వారికి సమానంగా పేదలు, బడుగు, బలహీనవర్గాలకు అండగా దామోదరం సంజీవయ్య నిలిచారని చెప్పారు. అలాంటి మహానీయులు స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించానని పునరుద్ఘాటించారు.

రెండేళ్లే పనిచేసినా..
దామోదరం సంజీవయ్య గురించి తాను రెండున్నర దశాబ్దాలుగా వింటున్నానని, మేధావులు, విద్యావేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు, దామోదరం సంజీవయ్య విశిష్టతను, పాలన దక్షతను ఇప్పటికీ చెబుతుంటారని పవన్ కల్యాణ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన రెండు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారని, అయినప్పటికీ ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఆరు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు.

వృద్ధాప్య పింఛన్లు ఆయన చలవే..
ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశారని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని ఆదేశించారని అన్నారు. తెలుగుపై ఆయనకు ఎనలేని అభిమానం ఉండేదని పవన్ కల్యాణ్ పేర్కన్నారు. వృద్ధాప్య పింఛన్ల పథకానికి రూపకల్పన చేసింది దామోదరం సంజీవయ్యేనని గుర్తు చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ల వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు. వెనకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచి వారికి అండగా ఉన్నారని పేర్కొన్నారు.

కార్మిక పక్షపాతిగా..
కార్మికశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి కార్మిక పక్షపాతిగా దామోదరం సంజీవయ్య గుర్తింపు పొందారని, ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలియ చేస్తామని అన్నారు. రెండు సంవత్సరాల పాటు పదవిలో ఉన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు, రాయలసీమలో గాజులదిన్నే, వరదరాజులు ప్రాజెక్టులు, కృష్ణా జిల్లాలో పులిచింతల ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన మహనీయుడని చెప్పారు.

ఆయన నివాసం స్మారకచిహ్నంగా..
లండన్‌లో అంబేద్కర్ భవన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నదో, అదే విధంగా దామోదరం సంజీవయ్య నివాసాన్ని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దుతామని, దీనికోసం కోటి రూపాయలతో ఓ నిధిని ఏర్పాటు చేశామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేశారని, ఏ ఒక్కరు కూడా దామోదరం సంజీవయ్య ఇంటిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పేరును ఏ ఒక్క పథకానికీ పెట్టకపోవడం బాధాకరమని అన్నారు.