40 వేల రూపాయల కోసం.. ఇండియన్ ఆర్మీ లైవ్ విజువల్స్ లీక్!
భారత సరిహద్దుల్లో హై సస్పెన్స్ గూఢచర్య ముఠా గుట్టురట్టయింది. జాతీయ భద్రతను సైతం ప్రమాదంలోకి నెట్టేలా సాగిన ఒక నయా ట్రెండ్ కుట్రను పంజాబ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. సరిహద్దు వ్యూహాత్మక ప్రాంతాల్లో కదిలే భారత సైన్యం, పారామిలటరీ దళాల నిమిషం నిమిషం సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థలకు చేరవేస్తున్న ఒక దేశద్రోహి గుట్టును పఠాన్‌కోట్ పోలీసులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో కీలక సూత్రధారి అయిన బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టును అరెస్టు చేయడంతో జాతీయ భద్రతా దళాలు ఊపిరి పీల్చుకున్నాయి.
చక్ ధరీవాల్ ప్రాంతానికి చెందిన బల్జిత్ సింగ్, సుజన్‌పూర్‌లోని అత్యంత కీలకమైన నేషనల్ హైవే-44 (NH-44) పై ఉన్న ఒక వంతెన సమీపంలో దుకాణాన్ని నడుపుతున్నాడు. ఈ మార్గం గుండానే పఠాన్‌కోట్-జమ్మూ రహదారి వెంబడి నిరంతరం భారత సైనిక వాహనాలు, కాన్వాయ్‌లు ప్రయాణిస్తుంటాయి. ఈ వ్యూహాత్మక ప్రదేశాన్ని పాక్ హ్యాండ్లర్ల ఆదేశాలతో బల్జిత్ సింగ్ తన గూఢచర్యానికి వేదికగా మార్చుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన దుకాణం వద్ద రహస్యంగా ఒక ఇంటర్నెట్ ఆధారిత సీసీటీవీ (CCTV) కెమెరాను అమర్చాడు. దీని ద్వారా సైనిక బలగాల ప్రతి కదలికను ఆ కెమెరా కంటితో రికార్డ్ చేయడం ప్రారంభించాడు.

దుబాయ్ కనెక్షన్.. రూ.40 వేల కోసం దేశద్రోహం!
పోలీసుల విచారణలో బల్జిత్ సింగ్ వెల్లడించిన నిజాలు విస్తుపోయేలా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలోనే ఈ హైటెక్ నిఘా ప్లాన్ అమల్లోకి వచ్చినట్లు అతడు అంగీకరించాడు. ఇంటర్నెట్ ఆధారిత సీసీటీవీ కెమెరాతో పాటు, దానికి నిరంతరం లైవ్ కనెక్టివిటీ ఉండేలా ఒక వైఫై రూటర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. దీని వెనుక దుబాయ్‌కు చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి హస్తం ఉందని, ఆ విదేశీ హ్యాండ్లర్ మార్గనిర్దేశం మేరకే ఈ కెమెరాను అమర్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ దేశద్రోహపు పనికి గానూ బల్జిత్ సింగ్ కేవలం రూ.40,000 నగదును అందుకున్నాడు. ఈ చిన్న మొత్తం కోసం సరిహద్దు హైవే లైవ్ సీసీటీవీ ఫీడ్‌ను పాకిస్థాన్‌తో పాటు విదేశాల్లోని గూఢచార హ్యాండ్లర్ల మొబైళ్లకు నేరుగా లింక్ చేసినట్లు పోలీస్ అధికారి దల్జిందర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు.
పోలీస్ రైడ్స్.. నలుగురిపై దేశద్రోహం కేసు!
పక్కా నిఘా సమాచారంతో రంగంలోకి దిగిన సుజన్‌పూర్ పోలీసులు బల్జిత్ సింగ్ దుకాణంపై మెరుపు దాడి చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి గూఢచర్యానికి వాడిన సీసీటీవీ కెమెరా, వైఫై రూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా.. బల్జిత్ సింగ్‌తో పాటు ఈ కుట్రలో భాగస్వామ్యమున్న విక్రమ్‌జిత్ సింగ్ అలియాస్ విక్కా, బల్వీందర్ సింగ్ అలియాస్ విక్కీ, తరణ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తన్ను అనే నలుగురిపై దేశ వ్యతిరేక కార్యకలాపాల చట్టాల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు సరిహద్దు పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.
చైనా కెమెరాలు.. సోలార్ పవర్.. సరిహద్దుల్లో గత నెల సీన్లు!
భారత రక్షణ వ్యవస్థను టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ కొత్త తరహా గూఢచర్య నెట్‌వర్క్ పట్ల భద్రతా సంస్థలు తీవ్ర అప్రమత్తమయ్యాయి. సరిగ్గా గత నెలలోనే పంజాబ్ పోలీసులు పాకిస్తాన్ ఐఎస్‌ఐ (ISI) కి లింక్ ఉన్న రెండు ఇలాంటి గూఢచర్య మాడ్యూల్స్‌ను ఛేదించారు. అప్పట్లో జలంధర్‌లో దొరికిన ఒక ముఠా.. చైనా తయారీ సీసీటీవీ కెమెరాలను ఏకంగా సోలార్ ప్యానెల్స్ సాయంతో కరెంట్ లేకపోయినా నడిచేలా ఏర్పాటు చేసి, సున్నితమైన మిలిటరీ ఏరియాల లైవ్ వీడియోలను సరిహద్దు దాటించారు.
ఇప్పుడు పఠాన్‌కోట్‌లో దొరికిన కేసు కూడా అదే తరహాలో ఉండటంతో.. ఈ సరిహద్దు లింకులు ఎక్కడి వరకు విస్తరించాయి, వీరికి అందుతున్న నిధుల మూలాలు ఎక్కడ ఉన్నాయి అనే కోణంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో లోతైన దర్యాప్తు సాగుతోంది. దీనిపై ఒక సమగ్ర నివేదికను కేంద్ర హోంశాఖకు కూడా పంపినట్లు సమాచారం.














Click it and Unblock the Notifications