42 రైల్వేస్టేషన్ల అభివృద్ధి, MMTS సేవలపై తెలంగాణాకు రైల్వే శుభవార్త!
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో రైల్వే సౌకర్యాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఎంఎంటీఎస్ సర్వీసులను మరింత సమర్థవంతంగా నడపాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను అభ్యర్థించారు. న్యూఢిల్లీలోని రైల్వే భవన్‌లో జరిగిన ముఖ్య సమావేశంలో కిషన్ రెడ్డి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు.
తెలంగాణా రైల్వే ప్రాజెక్ట్ లపై విస్తృత చర్చ
ఈ సమావేశంలో తెలంగాణ రైల్వేస్టేషన్ల అభివృద్ధి, ఎంఎంటీఎస్ సేవల మెరుగుదల, కొత్త రైల్వే లైన్లు, హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులు వంటి అనేక కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది. 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల్లో వేగం పెంచడం, ఎంఎంటీఎస్ రైళ్ల టైమింగ్స్ రెగ్యులర్ చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం,కొత్త రైల్వే లైన్లు మరియు హైస్పీడ్ కారిడార్ పనులను వేగవంతం చేయడం వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది.

తెలంగాణ రైల్వే అభివృద్ధికి పూర్తి సహకారం
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి, త్వరలోనే రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైల్వే అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని, రైల్వే నెట్‌వర్క్ విస్తరణలో తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
కేంద్రం సానుకూలంగా ఉందన్న మంత్రి కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు మెరుగైన రైల్వే సౌకర్యాలు అందించడం మా ప్రాధాన్యత. స్టేషన్లు ఆధునికంగా మారాలి. ఎంఎంటీఎస్ సర్వీసులు సకాలంలో నడిచి, ప్రయాణికులు సౌకర్యంగా ఉండేలా చూడాలని తాను కోరినట్టు అందుకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.. ఈ అభివృద్ధి పనులు పూర్తి కావడంతో తెలంగాణలో రైలు ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి.
కొత్త రైల్వే లైన్లు మరియు హైస్పీడ్ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం
ముఖ్యంగా హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంఎంటీఎస్ సేవలు మెరుగుపడితే రోజువారీ ప్రయాణికులకు పెద్ద ఉపయోగం ఉంటుంది. అలాగే, కొత్త రైల్వే లైన్లు మరియు హైస్పీడ్ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. తెలంగాణ రైల్వే రంగంలో ఈ అభివృద్ధి ముఖ్యమైన అడుగుగా పరిగణించవచ్చు.












Click it and Unblock the Notifications