పదేళ్ల పాటు చదివా, 10 నెలలు జైల్లో పెట్టినా సరే, 2019లో నేనే సీఎంను కావొచ్చు: పవన్ కళ్యాణ్
డల్లాస్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందకపోవడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు లభించకపోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన డల్లాస్‌లో ఎన్నారై డాక్టర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చిన్నతనం నుంచి సమస్యలను చూస్తున్న తాను విప్లవకారుడిగా మారాలనుకున్నట్లు చెప్పారు.

నాకు అవి సమాధానం చెప్పలేకపోయాయి
ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేస్తే, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. తనలో కలిగే ప్రతి ప్రశ్నకు పాఠ్య పుస్తకాలు, పాఠాలు సమాధానం చెప్పలేకపోయాయని, అందుకే తాను సొంతగా చదవడం ప్రారంభించానని చెప్పారు. పరీక్షల కోసం ప్రిపేర్ కావడం తనకు నచ్చలేదని చెప్పారు. అందుకే తాను స్వతహాగా చదువుకోవడం ప్రారంభించానని చెప్పారు.
తన కంటి ముందు ఎప్పుడు సమస్యలు కనిపించేవని చెప్పారు. చిన్నప్పటి నుంచి తనకు ఆనందం కనిపించలేదని అన్నారు.

ఎవరెవరో తిడతారు.. ఐనా రావాలని నిర్ణయించుకున్నా
పవన్ కళ్యాణ్ అంతకుముందు ఎన్నారైల సభలో మాట్లాడుతూ... తన పార్టీ వారైతే ఒకలా, అధికారం దగ్గరగా ఉంటే ఒకలా, డబ్బు ఎక్కువ ఉంటే, లేకపోతే మరోలా మన వద్ద సిస్టం నడుస్తోందని వాపోయారు. దేశ పౌరులందరికీ సమన్యాయం అనేది మనకు కలలో తప్ప ఎక్కడా కనిపించదని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో అవమానాలు పడాల్సి వచ్చిందని చెప్పారు. ఎవరెవరో వచ్చి తిడతారని, కొత్త పాత్రలు పుట్టుకు వస్తాయని, తిడుతుంటాయని, అయినప్పటికీ నేను రావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

అప్పుడు అసహ్యమేసింది
రాజకీయాల్లోకి రావటానికి ముందు పదేళ్ల పాటు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి చదివి ఆయన పడిన అవమానాలు, మాటలు అన్ని అర్థం చేసుకొని, చే గువేరా గురించి అర్థం చేసుకొని వచ్చానని, కాబట్టి ఎన్ని మాటలు అన్నా నేను కృంగిపోనని పవన్ చెప్పారు. ప్రజలు మనలను అడిగేది మౌలిక సదుపాయాలు అన్నారు. ఈ సమస్యలు చూస్తుంటే తన చుట్టుపక్కల వాళ్లను చూసాక అసహ్యమేసిందన్నారు.

అందుకే బయటి ఫంక్షన్లకు ఎక్కువగా రాను
తాను తాగొద్దని, తినొద్దని చెప్పడం లేదని, కానీ ఎంత వరకు చేయాలో అంతవరకు ఉండాలని, జీవితాలను నిరర్థకం చేసుకోవద్దని, ఎంతో కొంత దేశానికి కూడా పని చేయాలని, అందుకే తనకు ఎక్కువగా బయట ఫంక్షన్లకు రావడం ఇష్టంగా ఉండదని పవన్ చెప్పారు. జీవితంలో నువ్ ఏదైనా చేయగలవా అంటే చేయగలవని, ఒక ఉగ్రవాది ఆత్మాహుతి చేసుకుంటే దేవుడి దగ్గరకు వెళతాడనే భ్రమలో అంత చేస్తే, నేను దేశం కోసం ఎంత చేయాలని, ఎంత బలంగా చేయాలనే నమ్మకం ఉండాలని చెప్పారు. తాను ఎక్కువగా బయటకు వచ్చేవాడిని కాదని, తన మనసులో ఎప్పుడు దేశం కోసం బలమైన సైనికుడు కావాలని అనుకునేవాడినని, నా దేశం తాలూకు దోపిడీ నిలువరించాలన్నారు.

నేను ఇలా బయటకు వచ్చేందుకు పదేళ్ల పాటు కూర్చోని వారిని చదివా
ఎవరో ఒకరు బలంగా ప్రారంభించకుంటే మార్పు రాదని పవన్ అన్నారు. ధైర్యంగా ముందుకు వచ్చేందుకు తాను తనను తాను పదేళ్ల పాటు కూర్చొని మార్టిన్ లూథర్ కింగ్ జీవితాన్ని, ప్రసంగాలను, భగత్ సింగ్ జీవితాన్ని, చేగువేరా, గాంధీల గురించి చదివేవాడినని చెప్పారు. రాజకీయాల్లో తెలివి తేటల కంటే ధైర్యం, నిబద్దత, నమ్మకం కావాలన్నారు. ఎదుర్కోవాలన్నారు. దోపిడీని అరికట్టాలన్నారు. ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా.. వారు అనుకున్నారని, సాధించారని చెప్పారు.

10 నెలలు జైల్లో పెట్టినా తట్టుకుంటాను
తాను ఇలా అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడే, చాలామంది తిడతారని, నా మీద దాడులు చేస్తారని, కోప్పడకుండా తట్టుకోగలవా అని నన్ను నేను ప్రశ్నించుకున్నానని, తట్టుకోగలనని నిర్ణయానికి వచ్చానని, 10 నెలలు జైలులో పెట్టినా సరే తట్టుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నెల్సన్ మండేలా ఎలా తట్టుకొని నిలబడ్డారో చదివానని అన్నారు. ఎప్పుడు మీరు ఒక్కరే అని అనుకోవద్దని, మనందరం సమూలంగా అనుకుంటే మార్పు వస్తుందని, దోపిడీని అరికట్టవచ్చునని, రాజకీయ జవాబుదారితనాన్ని తీసుకు రాగలమని చెప్పారు. తాను 25 అని చెబుతున్నానని, అంటే అప్పుడు సీఎంను అవుతానని కాదని, 2019లోనే కావొచ్చునని చెప్పారు.












Click it and Unblock the Notifications