ఆ గాయాలు ఇంకా వద్దు - మోదీకి పవన్ ఆ రిక్వెస్ట్..!!
అమరావతి: ఇదివరకు ఉత్తర ప్రదేశ్‌లో పలు నగరాల పేర్లు పూర్తిగా మారిపోయాయి. మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ పేరును పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయగా మార్చిందక్కడి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అలహాబాద్‌కు ప్రయాగ్‌రాజ్‌గా నామకరణం చేసింది. రాజధాని లక్నో పేరును లక్షణపురిగా మార్చడానికి యోగి సర్కార్ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం విస్తృతంగా సాగింది. అదే ఆనవాయితీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగిస్తోన్నారు. దేశ రాజధానిలో కొన్ని ప్రాంతాల పేర్లల్లో మార్పులు చేశారు.

నాటి పేర్లు, చిహ్నాలు..
కింగ్స్‌వే, రాజ్‌పథ్ పేరును తొలగించి- కొత్తగా కర్తవ్యపథ్‌గా పేరు పెట్టారాయన. బ్రిటీష్ హయాంలో కింగ్స్‌వేగా ఉన్న పేరు ఆ తరువాత రాజ్‌పథ్‌గా మారింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం దాన్ని తొలగించింది. కర్తవ్యపథ్‌గా కొత్త పేరు పెట్టింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని- వలసవాద పాలనలో ఏర్పాటైన పేర్లు, చిహ్నాలను తొలగిస్తామంటూ ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేస్తోన్నారు.

స్వాగతించిన పవన్ కల్యాణ్..
మోదీ చేపట్టిన ఈ చర్యల పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పేర్ల మార్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బ్రిటీష్ రాచరిక పరిపాలన అంతరించి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా మానని గాయాలకు ఆ పేర్లు సజీవ గుర్తులుగా ఉన్నాయని, ప్రధాని మోదీ వాటిని తుడిచేస్తున్నారని అన్నారు. ఆ గాయాలను దేశం మరిచిపోవాల్సి ఉంటుందని చెప్పారు. కింగ్స్‌వేను కర్తవ్యపథ్‌గా భారతీయత ఉట్టిపడే పేరు పెట్టడం హర్షణీయమని చెప్పారు.

రేస్ కోర్స్ టు లోక్ కల్యాణ్ మార్గ్..
ప్రధాని అధికారిక నివాసం ఉండే మార్గాన్ని ఇదివరకు రేస్ కోర్స్‌గా పిలిచే వారని, ఇప్పుడు దాన్ని లోక్ కల్యాణ్ మార్గ్‌గా నామకరణం చేశారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అలాగే- వైమానిక దళం చిహ్నంలో కూడా మార్పులు చేశారని, ఇది చాలా మంచి నిర్ణయమని ప్రశంసించారు. వాయుసేన పతాకంలో సెయింట్ జార్జ్ క్రాస్ ఉండేదని, దాని స్థానంలో కొత్త పతాకాన్ని మోదీ తీసుకొచ్చారని, ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు మరిన్ని తీసుకుని రావాలని అన్నారు.

నేతాజీ అస్తికలు..
కర్తవ్యపథ్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అభ్యుదయ చర్యగా ప్రశంసించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. మోదీకి ఓ రిక్వెస్ట్ పెట్టారు. నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా ఆయనపై ఉన్న భక్తిభావాన్ని మోదీ చాటుకున్నారని, అదే చేతుల మీదుగా జపాన్‌లో భద్రపరిచిన ఆ మహావీరుడి అస్తికలను కూడా స్వదేశానికి రప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నేతాజీ మనవరాలు రాజశ్రీ చౌదరి బోస్.. అనుమతితో ఆమె డీఎన్ఏతో వాటిని సరిపోల్చాలని పవన్ కల్యాణ్ కోరారు. ఇది సాకారమైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యం సిద్ధిస్తుందని చెప్పారు. భారతజాతి విముక్తి కోసం పోరాడిన నేతాజీకి ఘన నివాళిగా మిగిలిపోతుందని అన్నారు.












Click it and Unblock the Notifications