ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఒప్పించింది..కృతజ్ఞతలు చెప్పాలా: పవన్ కల్యాణ్
అమరావతి: ఏపీ ప్రభుత్వం- ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకుక దారి తీసిన పీఆర్సీ వివాదానికి తెర పడింది. ఉద్యోగ సంఘాల నాయకులు- ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో సాగించిన చర్చలు సఫలం అయ్యాయి. దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ చర్చలు ఫలించాయి. ప్రతిపాదిత సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, వాటిని పరిష్కరించడానికి అంగీకరించిందని అన్నారు.

హెచ్‌ఆర్ఏ పెంపుతో..
ముఖ్యంగా హెచ్ఆర్ఏను పెంచడం, సీసీఏ కొనసాగింపు, అదనపు క్వాంటమ్ పింఛన్‌ను 70 సంవత్సరాలకు అమలు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిట్‌మెంట్ 23 శాతం కంటే ఎక్కువ చేయాలన్న డిమాండ్‌కు మాత్రం ప్రభుత్వం నిరాకరించింది. ఐఆర్ రికవరీ చేయకూడదని, అయిదేళ్లకోసారి పీఆర్సీ విధానం కొనసాగించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను మంత్రుల కమిటీ అంగీకరించింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని పొడిగించడానికీ అంగీకరించింది.

ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత..
ఇకపై 10 శాతం, 12 శాతం మేర నాలుగు హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను అమలు చేస్తామంటూ మంత్రుల కమిటీ చేసిన ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాల నాయకులు అంగీకరించారు. సమ్మె ప్రతిపాదనలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వంతో ప్రతిపాదిత సమ్మెను ఉపసంహరించుకునేలా ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తోన్నాయి. డిమాండ్ల పరిష్కారం కోసం తమతో కలిసి వచ్చే సంఘాలతో ఉద్యమిస్తామని స్పష్టం చేశాయి.

లభించని ఊరట..
ఈ పరిణామాల పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఉద్యోగులకు ఏ మాత్రం ఊరటను ప్రభుత్వం కల్పించలేదని అన్నారు. ఉద్యోగుల జీతబత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధిని కనపర్చలేదని విమర్శించారు. ఆధిపత్య ధోరణిని ప్రదర్శించిందని మండిపడ్డారు. ఫలితంగా ఉద్యోగులకు ఎలాంటి ఊరట లభించలేదని చెప్పారు. ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏ కొనసాగింపు, అశుతోష్ మిశ్రా నివేదిక వంటి ప్రధాన డిమాండ్లు పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.

కృతజ్ఞతలు చెప్పేలా..
ఐఆర్, హెచ్ఆర్ఏ, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రికవరీ నిలుపుదల అంశాన్ని పాక్షికంగా చేసిన కూడా సమ్మె ప్రతిపాదనలను ఉపసంహరించుకునేలా ప్రభుత్వం వారిపై ఒత్తిడిని తీసుకొచ్చిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పాక్షికంగా పెంచినా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితిని ప్రభుత్వం పీఆర్సీ స్టీరింగ్ కమిటీ, పీఆర్సీ సాదన సమితి నాయకులకు కల్పించిందని ధ్వజమెత్తారు. బలవంతంగా ఒప్పించినట్లు కనిపిస్తోందని అన్నారు.

సానుకూలంగా..
సమ్మె ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు విభేదించాయని, వాటిని తాము పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రస్తావిస్తోన్న అంశాలు, డిమాండ్ల పట్ల తమ పార్టీ సానుకూలంగా స్పందిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగుల భావోద్వేగాలకు తాము విలువ ఇస్తామని అన్నారు. వారి పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications