పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన టీడీపీ
పిఠాపురంలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ప్రతీష్టాత్మకంగా తీసుకువచ్చిన అన్న క్యాంటీన్లలో పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తం 183 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి రంగం సిద్దమైంది.
డొక్కా సీతమ్మ పేరుతో కూడా భవిష్యత్తులో క్యాంటీన్లు ప్రారంభిస్తామని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే అందరికంటే ముందు పవన్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నేత వర్మ అన్న క్యాంటీన్‌ను పునఃప్రారంభించేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కల్యాణ్‌తో సంప్రదించకుండానే అన్న క్యాంటీన్‌ను మొదలుపెట్టడంపై జనసేన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పవన్‌తో ఎలాంటి సంబంధం లేకుండా వర్మ అన్న క్యాంటీన్ ప్రారంభించారు.

ఇది టీడీపీ కార్యక్రమంలా చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్న క్యాంటీన్‌పై కేవలం ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలు మాత్రమే ఉండటంపై జనసేన నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని వర్మను జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ లేకపోవడంపై కూడా వారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తమ అధినేత దృష్టికి తీసుకువెళ్తామని జనసేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. దీనిపై జనసేన నాయకులు ఆందోళన చేస్తున్నప్పటికి అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ , జనసేన పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications