జనసేన ఓ కులానికి చెందిన పార్టీ, పోలీస్ కొడుకు సీఎం అట.. ఆపండి: పవన్‌పై జూపూడి సంచలనం
అమరావతి: గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అవుదామని వచ్చిన చిరంజీవి విఫలమయ్యారని, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. జనసేన నిర్వహించిన కవాతుపై నిప్పులు చెరిగారు.

జనసేన ఓ కులానికి చెందిన పార్టీ
2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే దక్కేవి డిపాజిట్లు తప్ప సీట్లు కాదని, ఆ పార్టీ గెలవదని జోస్యం చెప్పారు. జనసేన ఓ కులానికి చెందిన పార్టీ అని, ఆ పార్టీలో సామాజిక న్యాయం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ పైన కవాతు నిర్వహించిన పవన్ కళ్యాణ్ దానికి బదులు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో నిర్వహిస్తే బాగుండేదన్నారు.
Recommended Video


నారా లోకేష్ ఎప్పుడూ చెప్పలేదు, వారసత్వంపై మీరా
వారసత్వ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని జూపూడి ప్రభాకర రావు అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. చంద్రబాబు వారసుడిగా తాను ముఖ్యమంత్రి అవుతానని మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ చెప్పలేదన్నారు.

మోడీ డైరెక్షన్లో కానిస్టేబుల్ కొడుకు సీఎం అవుతారట.. ఆపండి
ప్రధాని నరేంద్ర మోడీ డైరెక్షన్‌లో ఓ కానిస్టేబుల్ కొడుకు (పవన్ కళ్యాణ్) ముఖ్యమంత్రి అవుతారట.... అని ఎద్దేవా చేశారు. మీ మాటలు ఆపండి అని జనసేనానికి సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబును, లోకేష్‌ను విమర్శిస్తూ మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారో ప్రజలు కచ్చితంగా సమాధానం చెబుతారని అన్నారు.

ఓ వైపు చంద్రబాబు, మరోవైపు పవన్... కలలు కంటూనే ఉండండి
ఓ వైపు కొన్నివేల మంది అబ్దుల్ కలాంలను తయారు చేయాలనుకునే స్వాప్నికుడు చంద్రబాబు అని జూపూడి ప్రభాకర రావు అన్నారు. మరోవైపు కారులో ఎక్కి నిలబడి కవాతు చేసే ఓ సినిమా హీరో.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లలో నవ్యాంధ్రకు సీఎం ఎవరు అవుతారో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. ఏపీ కోసం నిత్యం శ్రమిస్తున్న చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారన్నారు. పవన్ మాత్రం సీఎం కావాలనుకునే కలలు కంటూనే ఉండాలని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications