టీడీపీ పొత్తు ఖరార్- జనసేన పోటీ చేయబోయే సీట్లు ఇవే..?!
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. కుప్పం పర్యటనలో పోలీసులు చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో- ఆయనను పరామర్శించడానికే పవన్ కల్యాణ్ ఆయన ఇంటి గడప తొక్కారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

పొత్తు లాంఛనమే..
తెలుగుదేశం- జనసేన పార్టీల మధ్య ఇక పొత్తులు లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు ఉన్నాయి. పొత్తుల దిశగా పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకు వేశారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతం పొత్తులో కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన సంకేతాలను మొన్నటివరకు పెద్దగా పట్టించుకోలేదు పవన్. ఇప్పుడా పరిస్థితి లేనట్టే.

మహాకూటమిగా..
కారణం ఏదైనప్పటికీ- చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లడం అనేది పొత్తుల సంకేతాలుగానే భావించాల్సి వస్తోందనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, మాజీమంత్రులు ఈ భేటీని తప్పుపట్టినప్పటికీ- ఎలాంటి మొహమాటాలకు వెళ్లదలచుకోనట్టే కనిపిస్తోన్నారు ఆ ఇద్దరూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్సీపీని ఓడించడానికి మహాకూటమిగా ఆవిర్భవించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

సీట్ల పంపకాలు..
చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ నేపథ్యంలో తెలుగుదేశం- జనసేన పార్టీ మధ్య అధికారిక ప్రకటనలు, సీట్ల పంపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. ఈ దిశగా త్వరలోనే ఈ రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయనీ చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన 30 అసెంబ్లీ, అయిదు నుంచి ఎనిమిది లోక్ సభ స్థానాలను అడుగుతోందని.. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబుకు పంపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సీట్లు ఇవే..
ఈ నేపథ్యంలో- కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల పేర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. విశాఖపట్నం నార్త్, చోడవరం, గాజువాక, భీమిలీ, యలమంచిలి, రాజానగరం, అమలాపురం, రాజోలు, కాకినాడ రూరల్, భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెం, కైకలూరు, విజయవాడ పశ్చిమ, తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్, పుట్టపర్తి, గిద్దలూరు, చీరాల, చిత్తూరు, తిరుపతి, దర్శి, అనంతపురం అర్బన్ స్థానాలను తెలుగుదేశం పార్టీ- జనసేనకు కేటాయిస్తుందనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications