బాబుతో దోస్తీ- లాభమా?, నష్టమా?: జనసేన స్కానింగ్: విస్తృత స్థాయి భేటీ..!!
అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ ఒక్క ప్రకటన రాష్ట్ర రాజకీయాలన్నింటికీ కేంద్రబిందువు అయింది. తొమ్మిది నెలలు ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల వేడిని రాజేసినట్టయింది.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. తాను చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడుపోయాననే విషయాన్ని పవన్ కల్యాణ్ మరోసారి నిరూపించుకున్నాడంటూ ఆరోపిస్తోన్నారు ఆ పార్టీ నాయకులు.

యువతకు ఉపాధి కల్పిస్తాననే పేరుతో నెలకొల్పిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడ్డాడనే విషయాన్ని ఏపీ సీఐడీ అధికారులు సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటూ తేల్చి చెబుతున్నారు.
ఈ పరిణామాల మధ్య అటు జనసేన పార్టీ కూడా ఈ అంశాలపైనే దృష్టి సారించింది. అవినీతి ఆరోపణలతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల పార్టీకి ఎంత వరకు లాభం కలిస్తుందనే విషయంపై స్క్రూటినీ నిర్వహించనుంది.
దీనికోసం శనివారం విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటయింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజక వర్గాల ఇన్‌ఛార్జీలు, వీర మహిళ సమన్వయ కర్తలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, సంయుక్త కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
దీనికి పవన్ కల్యాణ్ అధ్యక్షత వహిస్తారు. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సహా కీలక నేతలు హాజరు కానున్నారు. పవన్ చేసిన పొత్తు ప్రకటన అనంతరం జనసేన.. ఈ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో కొన్ని కీలక తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది.
టీడీపీతో ఎలా కలిసి వెళ్లాలి? ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలేంటీ?, సీట్ల షేరింగ్ ఎలా ఉండాలి?, ఎన్ని సీట్లను అడగాలి?.. వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిత్రపక్షంగా ఉంటోన్న భారతీయ జనతా పార్టీతో పొత్తును ముందుకు తీసుకెళ్లాలా? వద్దా? అనేది చర్చకు వస్తుందని సమాచారం.












Click it and Unblock the Notifications