టీడీపీకి జనసేన అడిగిన సీట్లు ఇవే..?!
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. టీడీపీకి అండగా నిలవాలని జనసేన నిర్ణయించుకుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటూ స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఆయన చేసిన ఈ ప్రకటన కాస్తా జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులకు కొరుకుడు పడట్లేదు. తాము పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంటే.. ఆయన చంద్రబాబును సీఎం స్థానంలో కూర్చోబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోన్నారనే అభిప్రాయాలు బహిరంగంగా వ్యక్తమౌతోన్నాయి.

అయినప్పటికీ- ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోవట్లేదు జనసేన పార్టీ. పొత్తును మరింత ముందుకు తీసుకెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోకూడనే కారణంతోనే తాను టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు.
రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ రాజమండ్రిలో సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉమ్మడి మేనిఫెస్టోపై ఈ రెండు పార్టీల నేతలు చర్చించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి రూపొందించుకోవాల్సిన వ్యూహాలపై కసరత్తు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌తో పాటు సమన్వయ కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీట్ల పంపకాలు అంశం కూడా తెరమీదికి వచ్చినట్లు తెలుస్తోంది. 35 నుంచి 40 సీట్ల వరకు జనసేన డిమాండ్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రాయలసీమ, దక్షిణాంధ్ర, కోస్తా, ఉతర కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోటీ చేయాల్సిన నియోజకవర్గాలపై ఓ అవగాహనకు వచ్చారని చెబుతున్నారు.
ఈ క్రమంలో రాయలసీమలో 10 అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాల్సి ఉంటుందని జనసేన పార్టీ.. టీడీపీకి ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల పేర్లతో కూడిన ప్రతిపాదనలను అందజేసినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏవైనా మార్పులు ఉంటే తప్ప దాదాపుగా అవే స్థానాలను డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదు.
అన్నమయ్య రాయచోటి జిల్లాలో రెండు స్థానాలను కేటాయించాలని జనసేన పార్టీ కోరింది. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలను తమకు ఇవ్వాలని ప్రతిపాదించింది. తిరుపతి జిల్లా-2, చిత్తూరులో ఒక స్థానాన్ని డిమాండ్ చేసిందా పార్టీ. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాము పోటీ చేస్తామని తెలిపింది.
అనంతపురం జిల్లాలో అనంతపురం, గుంతకల్లు, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో ధర్మవరం సీట్లను తమకు వదిలివేయాలని కోరినట్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో ఆలూరు, నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ సీట్లను జనసేన పార్టీ అడిగినట్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60 నియోజకవర్గాల్లో తమకు బలం ఉందని నిరూపించేలా సర్వే నివేదికలను టీడీపీకి అందజేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications