ఆ నియోజకవర్గం కోసం పట్టుబడుతున్న జనసేన.. సందిగ్ధంలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రానున్న ఎన్నికలపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ముందస్తుకు సంబంధించిన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో జిల్లాల పర్యటన సమయంలోనే చంద్రబాబు వేసవిలోకానీ, డిసెంబరులోకానీ ముందస్తుకు అవకాశం ఉందని, శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో మూడు అడుగుతున్న జనసేన
జనసేనతో పొత్తు ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో ఆ పార్టీకి కేటాయించే నియోజకవర్గాలను కూడా చంద్రబాబు గుర్తించారని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. జనసేన కూడా రాష్ట్రవ్యాప్తంగా సీట్లు కాకుండా తనకు బలం ఉన్న జిల్లాలు, గత ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన నియోజకవర్గాలను గుర్తించి ఆ ప్రకారం సీట్లడగాలని యోచిస్తోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని తెనాలి, సత్తెనపల్లి నియోజకవర్గాలు ఆ పార్టీకి కేటాయిస్తారంటూ రెండు పార్టీల్లోను జోరుగా చర్చ సాగుతోంది.

వైసీపీ తరఫున ఆశావహులు
అయితే జనసేన వైపు నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా కావాలనే డిమాండ్ వస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన మద్దాలి గిరి వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎవరు పోటీచేస్తారన్నది ఖరారవలేదు. మద్దాలి గిరిపై పోటీచేసి ఓటమిపాలైన చంద్రగిరి యేసురత్నం మిర్చియార్డు చైర్మన్ గా కొనసాగుతున్నారు. పలువురు ఆశావహులు కూడా వైసీపీ తరఫున రానున్న ఎన్నికల్లో పోటీచేయడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.

బలం, బలగం ఉండటంతో..
గుంటూరు పశ్చిమలో తమ సామాజికవర్గానికి సంబంధించిన బలం, బలగం ఉండటంతోపాటు తెలుగుదేశం పార్టీకి కూడా కంచుకోట లాంటి నియోజకవర్గం కావడంతో దీనికోసం జనసేన పట్టుబడుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను తమ పార్టీ తరఫున అసెంబ్లీ లో 25 మందికి తగ్గకుండా ఎమ్మెల్యేలుండాలని, వారిని చూపించి ప్రజల దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు 2029 ఎన్నికలకు బలమైన పునాది వేసుకోవాలని జనసేనాని భావిస్తున్నారు. అయితే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన తరఫున పోటీచేస్తారు కాబట్టి అక్కడ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ అడుగుతూ వస్తున్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలను కూడా జనసేన అడుగుతండటంతో ఆలపాటితోపాటు చంద్రబాబు కూడా సందిగ్ధంలో పడ్డారు. చివరకు ఇది ఎవరికి చెందుతుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications