సనాతన ధర్మం కోసం జనసేనాని.. నేటి నుంచే దక్షిణాది రాష్ట్రాల యాత్ర
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైందవ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా.. పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌కు బయల్దేరి వెళ్లారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకోనున్నారు. అలానే ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రసిద్ద దేవాలయాలను పవన్ దర్శించుకోనున్నారు.
ఎక్కడ పర్యటించనున్నారంటే..?
ఇక ఈ మూడు రోజుల యాత్రలో కేరళ, తమిళనాడులోని 7 క్షేత్రాలను సందర్శించనున్నారు. వాటిలో అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని ఆయన టీమ్ వెల్లడించింది. అలానే గతంలో మొక్కుకున్న మొక్కులు కూడా తీర్చుకోనున్నారని సమాచారం.

ఎన్డీయేకి ప్లస్ అవుతుందా..?
మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటించనున్న తమిళనాడు, కేరళలో.. డీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ నినాదాన్ని డీఎంకే పార్టీ వ్యతిరేకించగా.. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సైతం విమర్శలు గుప్పించారు. అలానే కేరళలో సైతం కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండడంతో సనాతన ధర్మ పరిరక్షణ యాత్రను వ్యతిరేకించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక రాబోయే రెండు మూడేళ్లలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఎన్డీయేకి పవన్ యాత్ర ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. సనాతన ధర్మం గురించి డీఎంకే నేతలు వ్యతిరేకంగా మాట్లాడితే బిజెపి ఆ ఛాన్స్ వినియోగించుకోవచ్చని అనుకుంటుంది. మరి పవన్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ యాత్ర ఏ పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.
అంతకు ముందే..?
అయితే ఈ నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కానీ అనుకోని రీతిలో వైరల్ ఫీవర్ రావడంతో పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు జ్వరం నుంచి కోలుకోవడంతో.. దక్షిణాది రాష్ట్రాల యాత్రకు బయల్దేరినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications