అచ్చెన్నకు పవన్ పవర్ చూపించిన జనసైనికులు..!!
కూటమిలో ఆసక్తి కర సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులకే నిరసనలు తప్పటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి అచ్చెన్నకు వ్యతిరేకంగా జనసైనికులు నిరసనకు దిగారు. పవన్ పేరు ప్రస్తావన చేయకపోవటం పై మంత్రిని నిలదీసారు. మంత్రి బుజ్జగించే ప్రయత్నం చేసినా జనసైనికులు నిరసన కొనసాగించారు. దీంతో, సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి అచ్చెన్న వెనక్కు తిరిగారు. ఈ పరిణామాలు కూటమి పార్టీల్లో ఆసక్తి కర చర్చగా మారుతున్నాయి.
మంత్రి అచ్చెన్నాయుడుకు జనసైనికులు తమ పవర్ చూపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మె ల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఎన్నికల్లో గెలుపు కూటమి పార్టీలకు ప్రతిష్ఠాత్మ కంగా మారుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు పి గన్నవరం నియోజ కవర్గంలో బూత్ కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేసారు. మూడు పార్టీలకు చెందిన పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సమయంలో ఒక్క సారిగా జనసైనికులు నిరసనకు దిగారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల్లో సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించక పోవటం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన శ్రేణుల నిరసనతో మంత్రి షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని వారిని వారించే ప్రయత్నం చేసారు. దీంతో పవన్ లేకుండా ఎన్డీఏ లేదని మంత్రి వ్యాఖ్యానించారు. అయినా, జనసైనికులు తమ నిరసన కొనసాగించారు. తన మాట వినిపించుకోక పోవటం..గందరగోళం ఏర్పడటంతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం ముగించి వెళ్లిపోయారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి పవన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసి పవన్ పేరు ప్రస్తావన చేయకపోవటం జనసైనికులకు ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత స్థానిక నేతలు సర్దిచెప్పటంతో ఈ వివాదం అక్కడితో సద్దుమణిగింది.
ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. వీటితో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. మూడు పార్టీల శ్రేణులు కలిసి కట్టుగా పని చేసి కూటమి అభ్యర్ధుల ను గెలిపించాలని టీడీపీ నాయకత్వం కోరుతోంది. తాజా పరిణామాల పైన కూటమి పార్టీల్లో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications