Amaravati: అమరావతిలో వైసీపీకి పట్టు చిక్కిందా ? టీడీపీ దాడుల వెనుక ఏముంది ?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati)లో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీ (TDP) ప్రభావం పెరుగుతున్న వేళ వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు తాజాగా రైతులకు మద్దతుగా నిర్వహించిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ముఖ్యంగా రాజధానిలో రెండో విడత భూసేకరణకు భూములు ఇవ్వని రైతుల్ని ప్రభుత్వం వేధిస్తున్న తరుణంలో వారికి అండగా నిలిచేందుకు వైసీపీ నేతలు మొదలుపెట్టిన పర్యటనను ఉండవల్లి, పెనుమాకలో టీడీపీ నాయకులు రాళ్లు, కోడిగుడ్లు రువ్వి అడ్డుకున్నారు. అయితే అమరావతిలో తాజా ఉద్రిక్తతల వెనుక ఉన్న కారణమేంటో ఓసారి పరిశీలిద్దాం..
అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే టీడీపీ నేతలు ముందుగానే ఈ విషయం తెలిసి ఇక్కడ భారీ ఎత్తున భూముల్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారనేది వైసీపీ ఆరోపణ. అప్పటి నుంచీ అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ వస్తుున్న వైసీపీ, తాము అధికారంలోకి రాగానే దీని స్ధానంలో మూడు రాజధానుల్ని చేసేందుకు విఫలయత్నం చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ఈసారి అమరావతిలో పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే రాజధానిలో కొందరు రైతులు మాత్రం ప్రభుత్వానికి తమ భూములిచ్చేందుకు సిద్దంగా లేరు. దీనికి కారణం ఎప్పుడో పదేళ్ల క్రితమే భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడమే.

ఇదే కారణంతో కొందరు రైతులు ప్రభుత్వ రాజధాని నిర్మాణ ప్రయత్నాలకు అడ్డు తగులుతున్నారు. వీరిని ప్రభుత్వ అధికారులు వేధించడం ప్రారంభించారు. అలాంటి రైతుల పొలాల వైపుగా కొండవీటి వాగు నీటిని వదిలి ముంచేయడం, పంటలు నాశనం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వీరంతా వైసీపీ అధినేత జగన్ ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రాజధాని రైతు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసిన జగన్.. నేతల్ని అక్కడికి పంపారు. జగన్ ఆదేశాలతో నిన్న రాజధాని గ్రామాల్లో పర్యటనకు వెళ్లున్న వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీల కార్లు అడ్డుకుని టీడీపీ నేతలు దాడులకు దిగారు.

టీడీపీ గూండాలే ఈ దాడులు చేశారని వైసీపీ ఆరోపిస్తుంటే, వైసీపీ పర్యటనను వ్యతిరేకిస్తూ రైతులే దాడులు చేశారని ప్రభుత్వం చెబుతోంది. అలాగని చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని వెంటనే అరెస్టు చేశారా అంటే అదీ లేదు. ఈ దాడుల్లో ఓ కానిస్టేబుల్ కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. అయినా పోలీసులు స్పందించలేదు. దీంతో ఈ ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. అయితే వైసీపీకి టీడీపీ తప్పిదాలతో రాజధానిలో పట్టు సాధించేందుకు ఓ అవకాశం దొరికింది. దీన్ని వైసీపీ సద్వినియోగం చేసుకుంటుందా, రైతుల్ని రెచ్చగొట్టి టీడీపీ ఆ అవకాశం లేకుండా చేస్తుందా అనేది కాలం తేల్చాల్సి ఉంది.















Click it and Unblock the Notifications