మంగళగిరి కేంద్రంగా పవన్ తాజా నిర్ణయం - "మార్పు" ఫలించేనా..!!
ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. తన సంక్షేమ పథకాలే తనను తిరిగి గెలిపిస్తాయని జగన్ ధీమాగా ఉన్నారు. జనసేనతో పొత్తు కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో వైసీపీలో అభ్యర్దుల మార్పు మొదలైంది. టీడీపీ -జనసేన సీట్ల సర్దుబాటు చర్చలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే లోకేష్ నియోజకవర్గం కేంద్రంగా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మంగళగిరి కేంద్రంగా : టీడీపీ నేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఆసక్తి కర రాజకీయం మొదలైంది. 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్ది ఆళ్ల రామక్రిష్ణారెడ్డి పై పోటీ చేసి ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో తిరిగి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే వైసీపీకి దూరమయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గంజి చిరంజీవి బరిలో నిలవనున్నారు. అక్కడ లోకేష్ ను ఓడించేందుకు జగన్ బీసీ అభ్యర్దిని ఎంపిక చేసారు. దీంతో..టీడీపీ - జనసేన అలర్ట్ అయ్యాయి. లోకేష్ ను గెలిపించుకోవటం ఇప్పుడు రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ సమయంలోనే పవన్ కల్యాణ్ తాజా నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

పొత్తు వేళ కలిసొచ్చేలా : పవన్ కల్యాణ్ తన ఓటును విజయవాడ నుంచి మంగళగిరి మార్చుకున్నారు. దీని వెనుక కొత్త వ్యూహం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. పవన్ ను వైసీపీ తరచూ ఏపీకి గెస్ట్ గా వస్తున్నారని..తెలంగాణ ఎన్నికల వేళ తాజాగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. ఏపీలో ఉండరని..పొరుగు రాష్ట్రంలో ఉంటూ ఏపీ ప్రయోజనాల కంటే చంద్రబాబు కోసమే పని చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీంతో..పవన్ మంగళగిరికి ఓటు మార్చుకోవటంతో కీలక సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంగళగిరి పరిధిలోనే ఇల్లు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా తాను అమరావతి పరిధిలోనే ఉంటానని చెప్పటం పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అమరావతి రాజధానిగా మద్దతు ప్రకటించటంతో పాటుగా..లోకేష్ గెలుపు కోసం పవన్ నుంచి ఇది తొలి అడుగుగా విశ్లేషణలు మొదలయ్యాయి.

మారుతున్న రాజకీయం : ఇప్పటికే సీఎం జగన్ మంగళగిరి నియోజకవర్గ పరిధిలోనే నివాసం ఉంటున్నారు. అదే విధంగా చంద్రబాబు సైతం ఉండవల్లి నివాసంలోనే ఉంటున్నారు. దీంతో..ఇక ఏపీ అందునా అమరావతి పరిధిలోనే ఉండటం ద్వారా రాజకీయంగా కలిసి వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగాబాబు ఓటు పైన వివాదం కొనసాగుతున్న వేళ..పవన్ తన ఓటును మంగళగిరికి మార్చుకున్నారు. దీని ద్వారా తమ పైన వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. మంగళగిరిలో సామాజిక సమీకరణాల్లో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నిక ఆసక్తి కరంగా మారుతోంది. పవన్ తాజా నిర్ణయం పొత్తు వేళ రెండు పార్టీలకు ఏ మేర కలిసి వస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications